నటి మంచు లక్ష్మి ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఆమె ‘హౌటర్ ఫ్లై’ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన టీనేజ్‌లో జరిగిన దారుణాన్ని బయటపెట్టారు. 15 ఏళ్ల వయసులో, అంటే 10వ తరగతి చదువుతున్నప్పుడు తనకు తొలిసారి లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఆమె తెలిపారు.
సాధారణంగా, మోహన్ బాబు కుమార్తె కావడంతో తన స్కూల్ ప్రయాణాలు డ్రైవర్, బాడీగార్డ్ లేదా తల్లితోనే జరిగేవని మంచు లక్ష్మి గుర్తుచేసుకున్నారు. అయితే, ఒకసారి హాల్ టిక్కెట్లు తీసుకోవడం కోసం స్కూల్ యాజమాన్యం విద్యార్థులను పబ్లిక్ బస్సులో తీసుకెళ్లింది. ఆ సమయంలో, స్నేహితులతో కలిసి బస్సులో వెళ్లడం చాలా ఉత్సాహంగా అనిపించిందని ఆమె అన్నారు.
కానీ, ఆ ఉత్సాహం కొద్దిసేపే నిలిచింది. బస్సులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను అసభ్యంగా తాకడం ప్రారంభించారు. మొదట, రద్దీ కారణంగా అనుకోకుండా తగిలిందేమో అని భావించినా, ఆ స్పర్శ ఉద్దేశపూర్వకంగానే కొనసాగిందని ఆమె గ్రహించారు. ఆ సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదని, ఆ అసహ్యకరమైన అనుభూతితో భయపడి, గొడవ పడకుండా దూరంగా జరిగిపోయానని (ఫ్రీజ్ అయ్యానని) మంచు లక్ష్మి చెప్పారు.
ఈ విషయం తన స్నేహితురాళ్లతో పంచుకున్నప్పుడు, వారు కూడా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నట్లు చెప్పారని ఆమె అన్నారు. “దీనికోసం నన్ను ప్రత్యేకంగా ఎంచుకోలేదు. ఇది అందరికీ జరుగుతుంది” అని ఆమె వ్యాఖ్యానించారు.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించిన ఏ అమ్మాయి అయినా తనకు ఇలా జరగలేదని చెబితే అది అబద్ధమేనని ఆమె ఘాటుగా అన్నారు. #MeToo ఉద్యమం సమయంలో తాను ఎందుకు అంతగా కుప్పకూలిపోయానో వివరిస్తూ, మహిళా కమీషన్ కరపత్రంలోని ప్రతీ అంశం తనకు జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద కుటుంబాల నుండి వచ్చిన వారు పరువు పోతుందని బయటకు చెప్పరనే ధోరణి కూడా సమాజంలో ఉందని ఆమె పేర్కొన్నారు.

