‘బాహుబలి: ది ఎపిక్’ కలెక్షన్ల సునామీ: రీ-రిలీజ్‌లో కొత్త రికార్డు


తెలుగు సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన ‘బాహుబలి’ ఫ్రాంఛైజీ, ఏళ్లు గడిచినా ప్రేక్షకుల అభిమానం ఏ మాత్రం తగ్గలేదని ఈ కలెక్షన్లతో నిరూపించింది. గతంలో విడుదలైన రీ-రిలీజ్ చిత్రాలన్నీ కేవలం మొదటి రోజు మాత్రమే భారీ వసూళ్లు రాబట్టగా, ఈ చిత్రం మాత్రం వారాంతం మొత్తం నిలకడగా కలెక్షన్లు సాధించి ‘లాంగ్ రన్ దిశగా దూసుకుపోతోంది.

‘బాహుబలి: ది ఎపిక్’ తొలి రోజు కలెక్షన్లతోనే అనేక రికార్డులను బద్దలు కొట్టింది. భారతదేశంలో అత్యధిక ఓపెనింగ్ డే గ్రాస్ వసూళ్లు సాధించిన రీ-రిలీజ్ చిత్రంగా ఇది నిలిచింది. మూడు రోజులకు కలిపి భారతదేశంలో ఈ చిత్రం నికర వసూళ్లు 24.35 కోట్లుగా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు సుమారు 37 కోట్ల మార్క్‌ను దాటాయి.

ప్రాంతాల వారీగా అంచనా (గ్రాస్ వసూళ్లు)

ఈ అద్భుతమైన వసూళ్లలో తెలుగు రాష్ట్రాల (AP/TS) వాటా కీలకంగా ఉంది:

  • నైజాం : ఈ ప్రాంతం నుంచి అత్యధికంగా ₹8.90 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
  • ఆంధ్ర (AP): ఇక్కడ ₹6.50 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.
  • సీడెడ్: ఈ ప్రాంతంలో ₹1.90 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

దీనికి తోడు, కర్ణాటక, తమిళనాడు, కేరళతో కలిపి ₹5.90 కోట్లు మరియు హిందీ మార్కెట్ నుంచి ₹5.65 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. విదేశీ మార్కెట్ నుంచి ఏకంగా ₹11 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి, ఓవర్సీస్‌లోనూ రికార్డు సృష్టించింది.

‘బాహుబలి: ది ఎపిక్’ అనేది మొదటి రెండు భాగాలైన ‘ది బిగినింగ్’, ‘ది కంక్లూజన్’ చిత్రాలను కలిపి, నిడివిని తగ్గించి, 3 గంటల 44 నిమిషాలకు సవరించిన వెర్షన్. కథా వేగాన్ని పెంచేందుకు అవంతిక రొమాన్స్ సీన్లు, కొన్ని పాటలు వంటివి తొలగించారు. ఈ సవరించిన వెర్షన్ ప్రేక్షకులకు ఒకేసారి పూర్తి కథను ఆస్వాదించే అవకాశాన్ని ఇచ్చింది.

ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ చిత్రం ఫుల్ రన్‌లో 60 నుంచి 70 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంటుందని, మంచి లాంగ్ రన్ సాధిస్తే 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్నా ఆశ్చర్యం లేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a comment