కొత్త పార్టీపై కవిత క్లారిటీ.. ఏప్రిల్‌లో ప్రకటన ప్రచారంపై స్పష్టత

బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ముఖ్యంగా, వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఆమె కొత్త పార్టీని ప్రకటించబోతున్నారంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పష్టతనిచ్చారు.

సోమవారం ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, ఈ ప్రచారాన్ని ఖండించారు. “కొత్త పార్టీ ప్రకటనపై వస్తున్న వార్తల్లో నిజం లేదు, అలాంటిదేమీ లేదు,” అని ఆమె తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి “జాగృతి జనం బాట” కార్యక్రమంపైనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 13న ముగుస్తుందని, ఈ నాలుగు నెలల పాటు ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకుంటున్నామని అన్నారు. “జనం బాట అనేది రాజకీయ ఎజెండా కాదు, ఇది పూర్తిగా పబ్లిక్ ఎజెండాతో ముందుకు వెళ్తోంది,” అని కవిత నొక్కి చెప్పారు. ఈ యాత్ర ద్వారా సంస్థాగతంగా జాగృతిని మరింత బలోపేతం చేసుకుంటున్నామని, పాత కార్యకర్తలతో పాటు కొత్త వారు కూడా కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.

బీఆర్ఎస్ అధిష్టానం నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. గతంలో, “కొత్త పార్టీ పెట్టే ముందు కేసీఆర్ గారు కూడా వందల మందితో చర్చించారు. నేను కూడా అదే చేస్తున్నాను,” మరియు “ప్రజలు కోరుకుంటే పార్టీ పెట్టడానికి సిద్ధం” వంటి వ్యాఖ్యలు చేయడంతో ఆమె సొంత దారి చూసుకుంటున్నారనే ప్రచారం బలపడింది. దీనికి తోడు, ఆమె “జనం బాట” కార్యక్రమాన్ని ప్రకటించడంతో, ఇది కొత్త పార్టీకి పునాది వేసేందుకేనని, ఏప్రిల్‌లో యాత్ర ముగింపు సందర్భంగా ప్రకటన ఉంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. తాజా ప్రకటనతో ఆమె ఈ ఊహాగానాలన్నింటికీ తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టారు.

ఈ సందర్భంగా కవిత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. “రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ, ‘మెంత’ తుఫాన్ కారణంగా నష్టపోయిన పత్తి రైతుల మీద లేదు,” అని ఆమె అన్నారు. పత్తిలో తేమ శాతం 20-25% ఉన్నా అంగీకరించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఫీజు రియంబర్స్‌మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని విమర్శించారు.

Leave a comment