కాంగ్రెస్ పార్టీ ‘ఓటు చోరీ’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ నేడు మీడియాతో మాట్లాడారు. ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు భారత ఎన్నికల సంఘం (ECI)పై సంచలన ఆరోపణలు చేశారు.
కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో భారీ మోసాలు జరిగాయని రాహుల్ గాంధీ గతంలోనే పేర్కొన్నారు. అక్కడ 1,00,250 ఓట్లకు పైగా ఐదు రకాలుగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఉదాహరణకు, ఒకే చిరునామాలో 80 మందికి పైగా ఓటర్లుగా నమోదవడం, నకిలీ చిరునామాలతో ఓట్లు నమోదు చేయడం వంటివి బయటపడ్డాయని తెలిపారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ ఈ ‘ఓటు చోరీ’ ఆటను దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు విస్తరిస్తున్నారని ఆరోపించింది. దీనిని ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ పేరుతో బీజేపీ, ఈసీఐ కలిసి వ్యవస్థీకృతంగా అమలు చేస్తున్నాయని ఆరోపించారు.
బీహార్‌లో ఈ SIR ప్రక్రియ ద్వారా 69 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, ఈ తొలగింపుల వల్ల ఎక్కువగా పేదవారు, మహిళలు, మైనారిటీలు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసీఐ డిజిటల్ డేటా ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు, భారత ఎన్నికల సంఘం (ECI) ఈ ఆరోపణలను ‘నిరాధారమైనవి’ గా కొట్టిపారేసింది. ఈసీఐ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పందిస్తూ, ఓటరు జాబితాలను సరిదిద్దేందుకు SIR ఒక సాధారణ ప్రక్రియ అని వివరించారు. అంతేకాకుండా, రాహుల్ గాంధీ తన ఆరోపణలకు మద్దతుగా చట్ట ప్రకారం అఫిడవిట్‌పై సంతకం చేసి సమర్పించాలని, లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని ఈసీఐ డిమాండ్ చేసింది.
ఇదే సమయంలో, బీజేపీ నాయకులు ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమైనవిగా ఖండించారు. ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ ఒక సాకు వెతుకుతోందని బీజేపీ ఆరోపించింది. ఏదేమైనా, కీలక రాష్ట్ర ఎన్నికలకు ముందు ఈ ‘ఓటు చోరీ’ అంశం జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.


అమరావతి: 53,000 ఎకరాలు ఏమయ్యాయి? రెండో దశ భూసమీకరణపై సంచలన ప్రశ్నలు!
on December 3, 20250