BRS ఫిరాయింపుల కేసు: సుప్రీంకోర్టులో సోమవారం విచారణ

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కీలక పిటిషన్‌పై నవంబర్ 17, సోమవారం నాడు విచారణ జరపనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

ఈ వివాదానికి అసలు కారణం 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడమే. దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి ముఖ్య నేతలు కూడా వీరిలో ఉన్నారు. 2024 మార్చి, జూన్ నెలల మధ్య వీరంతా కాంగ్రెస్ గూటికి చేరారు.

దీనితో, పార్టీ ఫిరాయింపుల చట్టం (పదవ షెడ్యూల్) కింద వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఆరోపించింది.

ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూలై 31, 2025న సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది.

ఆ గడువు ముగిసినా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ అమలు చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై సోమవారం చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ విచారణ తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Leave a comment