కరీబియన్‌లో ‘ఐబొమ్మ’ రెస్టారెంట్.. రవి ఫ్యూచర్ ప్లాన్ విని పోలీసులే షాక్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ‘ఐబొమ్మ’ (iBomma) సృష్టికర్త ఇమంది రవి అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.

ఇన్నాళ్లు టెక్నాలజీని అడ్డం పెట్టుకుని పోలీసులకు దొరక్కుండా తిరిగిన రవి, ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసుల వలలో చిక్కుకున్నాడు. అయితే, పోలీసుల విచారణలో రవి బయటపెట్టిన తన ‘ఫ్యూచర్ ప్లాన్స్’ విని ఖాకీలే షాక్ అయ్యారు. జైలుకు వెళ్లకపోతే రవి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనే ప్రశ్నకు అతడు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

పోలీసుల విచారణలో రవి చెప్పిన వివరాల ప్రకారం.. అతనికి ఇండియాలో ఉండే ఉద్దేశం అస్సలు లేదట. ఇప్పటికే కరీబియన్ దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం తీసుకున్న రవి, అక్కడే శాశ్వతంగా సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు.

అక్కడ కేవలం నివసించడమే కాదు, ఏకంగా ‘ఐబొమ్మ’ పేరుతోనే ఒక భారీ రెస్టారెంట్ పెట్టాలనేది అతడి కల అట. మన తెలుగు రాష్ట్రాల ఘాటైన వంటకాలను, భారతీయ రుచులను కరీబియన్ వాసులకు పరిచయం చేసి, ఆ బిజినెస్ ద్వారా లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకున్నాడట.

రవి లైఫ్ స్టైల్ కూడా మామూలుగా లేదు. పైరసీ ద్వారా సంపాదించిన డబ్బును నీళ్లలా ఖర్చు చేశాడట. ఇప్పటి వరకు సుమారు రూ.17 కోట్లు కేవలం జల్సాలు, విదేశీ పర్యటనల కోసమే తగలేశాడని సమాచారం. ఏకంగా 86 దేశాలను చుట్టివచ్చానని రవి గొప్పగా చెప్పుకోవడం గమనార్హం. “నేను సంపాదించింది ఎంజాయ్ చేయడానికే” అనే రేంజ్ లో అతని సమాధానాలు ఉన్నాయని ఇన్‌సైడ్ టాక్.

అయితే, రవి ఆశలపైన పోలీసులు నీళ్లు చల్లారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రాగానే ఎయిర్ పోర్ట్ లోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని దగ్గర నుండి సుమారు రూ.3 కోట్ల నగదును, ఇతర ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు.

“పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తావా?” అని అధికారులు వ్యంగ్యంగా అడిగితే.. “నా టాలెంట్ వేరు, నా ప్లాన్స్ వేరు.. కరీబియన్‌లో రెస్టారెంట్ పెట్టి కింగ్ లా బతుకుతా” అని బదులిచ్చాడట. మొత్తానికి ఆన్‌లైన్ లో సినిమాలను లీక్ చేసి ప్రొడ్యూసర్ల కడుపు కొట్టిన రవి, ఇప్పుడు కరీబియన్‌లో వంటలు వడ్డించాలనే కలను పక్కనపెట్టి చంచల్‌గూడ జైలు గోడల మధ్య ఊచలు లెక్కపెడుతున్నాడు.

Leave a comment