‘వారణాసి’ ఈవెంట్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రసంగం హైలైట్‌గా నిలిచింది. భారీ జనసందోహాన్ని చూసి, ఆయన తనదైన శైలిలో చమత్కరించారు. “అప్డేట్ అప్డేట్ అన్నారు కదా, ఎలా ఉంది? నా డైలాగ్‌లోనే చెప్పాలి.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. నాకు కూడా అలాగే ఉంది” అంటూ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచారు.
అంతేకాకుండా, రాజమౌళి తన స్టైల్‌ను పూర్తిగా మార్చేశారని సరదాగా వ్యాఖ్యానించారు. “సింపుల్‌గా నడిచి వస్తానంటే కుదరదు అన్నారు. బ్లూ షర్ట్ వేసుకుంటానంటే కుదరదు అన్నారు. కనీసం బటన్స్ అయినా ఇవ్వమంటే అదీ కుదరదు అన్నారు. ఇంకా నయం, చొక్కా లేకుండా రమ్మనలేదు” అంటూ నవ్వించారు.
ఆ తర్వాత, మహేష్ బాబు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి, దివంగత సూపర్‌స్టార్ కృష్ణ గారిని గుర్తుచేసుకున్నారు. “నాన్నగారు అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పిన ప్రతీ మాట విన్నాను, ఒక్కటి తప్ప. నన్ను ఎప్పుడూ ఒక పౌరాణిక సినిమా చేయమని అడిగేవారు. ఆ గెటప్‌లో బాగుంటానని చెప్పేవారు. నేను ఎప్పుడూ ఆ మాట వినలేదు,” అని అన్నారు.
“ఈరోజు నా మాటలు ఆయన వింటూనే ఉండుంటారు. ఆయన ఆశీస్సులు మనతోనే ఉంటాయి. నాన్నగారి కల ఈరోజు నెరవేరుతోంది” అంటూ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు.
ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం అని అన్నారు. “దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. మిమ్మల్ని, ముఖ్యంగా మా డైరెక్టర్‌ను గర్వపడేలా చేస్తాను. ‘వారణాసి’ రిలీజ్ అయ్యాక, యావత్ భారతదేశం మనల్ని చూసి గర్విస్తుంది” అని మహేష్ బాబు తన ప్రసంగాన్ని ముగించారు.

