సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న సినిమా (SSMB29) టైటిల్‌ను ‘వారణాసి’ గా ప్రకటిస్తూ ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో, త్రిశూలం ధరించి, ఎద్దుపై స్వారీ చేస్తూ కనిపించారు. ఈ లుక్ ఒక ఎత్తైతే, ఈ సినిమా గురించి బయటికొచ్చిన అసలు విషయం ఫ్యాన్స్ ఊహలకే అందడం లేదు.
తండ్రి కలను నెరవేరుస్తూ..
ఈ సినిమా గురించి రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ మరియు రాజమౌళి పంచుకున్న విషయాలు సినిమాపై అంచనాలను ఆకాశాన్ని దాటించాయి. ముఖ్యంగా, ‘వారణాసి’ చిత్రంలో రామాయణంలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీశారట. ఈ ఎపిసోడ్లో మహేష్ బాబు సాక్షాత్తూ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు.
ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ధృవీకరించారు. “మహేష్‌ను రాముడి గెటప్‌లో ఫోటోషూట్ చేసినప్పుడు నాకే గూస్బంప్స్ వచ్చాయి” అని జక్కన్న చెప్పడం విశేషం. అంతేకాకుండా, మహేష్ బాబు కూడా ఈవెంట్లో మాట్లాడుతూ, “మా నాన్నగారు (కృష్ణ) నన్ను ఎప్పుడూ ఒక పౌరాణిక సినిమా చేయమని అడిగేవారు. ఈ రోజు ఆయన కల నెరవేరుతోంది” అని భావోద్వేగానికి గురయ్యారు.
30 నిమిషాల ‘విశ్వరూపం’..
ఇక సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ అయితే అంచనాలకు ఆజ్యం పోశారు. ఆయన మాట్లాడుతూ, “సినిమాలో దాదాపు 30 నిమిషాల నిడివి గల ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంది. అది చూసి నేను షాక్ అయ్యాను. అందులో మహేష్ బాబు ‘విశ్వరూపం’ చూస్తారు. దాన్ని యాక్షన్ అనాలా, ఆవేశం అనాలా.. మాటలు రావడం లేదు. ఆ సీన్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తుంది” అని హామీ ఇచ్చారు.
‘వారణాసి’ కేవలం ఒక్క ప్రాంతానికి పరిమితమైన కథ కాదు. ఇది ఒక గ్లోబల్, టైమ్ ట్రావెల్ అడ్వెంచర్. క్రీ.శ 512 వారణాసి, క్రీ.పూ 7200 త్రేతాయుగం, మరియు 2027 వర్తమానం.. ఇలా వేర్వేరు కాలాల్లో ఈ కథ సాగుతుంది.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనాస్ ‘మందాకిని’ అనే కీలక పాత్ర పోషిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే భయంకరమైన విలన్‌గా నటిస్తున్నారు. రాజమౌళి మాటల్లోనే ఇది ఒక ‘గ్లోబ్-ట్రాటింగ్’ అడ్వెంచర్.
మొత్తం మీద, కేవలం టైటిల్ ప్రకటనకే ఈ స్థాయిలో హైప్ రావడం, అందులోనూ మహేష్ బాబును రాముడిగా ఊహించుకోవడం ఫ్యాన్స్‌కు పండుగలా మారింది. ఈ 30 నిమిషాల గూస్బంప్స్ ఎపిసోడ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

