ఏపీకి భారీ వర్షాలు, తెలంగాణకు చలి పంజా.. రెండ్రోజులు అలర్ట్!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వాతావరణంలో పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్ష సూచన జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే, శ్రీలంక తీరానికి సమీపంలో శనివారం ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా తమిళనాడు వైపు కదులుతోంది.దీని ప్రభావంతో, ఆదివారం (నవంబర్ 16) దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అయితే, సోమవారం (నవంబర్ 17) నాడు తీవ్రత పెరగనుంది.

ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదనంగా, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. నవంబర్ 18న కూడా ఈ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయి.

ఈ అల్పపీడనం ప్రభావం దక్షిణ జిల్లాలకే పరిమితం కావడంతో, ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని IMD స్పష్టం చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

తెలంగాణలో ‘కోల్డ్ వేవ్’..!

ఆంధ్రప్రదేశ్‌లో వర్షం ఉంటే, తెలంగాణలో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుండగా, ఉత్తర గాలుల ప్రభావంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి.

ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, సంగారెడ్డి, మేడ్చక్ జిల్లాలకు వాతావరణ శాఖ ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరో అల్పపీడనం..!

ఇదిలా ఉండగా, నవంబర్ 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో నవంబర్ 24 నుండి 27 మధ్య కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Leave a comment