27 ఏళ్ల తర్వాత రాజశేఖర్, రమ్యకృష్ణ…హిట్టు సినిమా కోసం మళ్లీ ఆన్‌స్క్రీన్ జోడీ!

ఈమధ్య తమిళంలో చిన్న సినిమాగా విడుదలై, విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా పెద్ద విజయం సాధించిన చిత్రం ‘లబ్బర్ పందు’ (Lubber Pandhu). ఇది ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఇప్పుడు ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను రాజశేఖర్ సొంతం చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ కూడా నిశ్శబ్దంగా మొదలైపోయింది.

ఈ రీమేక్‌లో రాజశేఖర్, తమిళంలో ‘అట్టకత్తి’ దినేష్ పోషించిన కీలకమైన, కాస్త ఏజ్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అసలైన సెన్సేషనల్ న్యూస్ వేరే ఉంది. సుమారు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, రాజశేఖర్‌కు జోడీగా సీనియర్ నటి రమ్యకృష్ణ నటించబోతున్నారు. 90వ దశకంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అల్లరి ప్రియుడు’ వంటి బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ వీరు తెరపై జంటగా కనిపించనుండటం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

‘లబ్బర్ పందు’ కథ ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. తమిళంలో హరీష్ కళ్యాణ్ చేసిన మరో ప్రధాన పాత్రలో ’35 చిన్న కథ కాదు’ ఫేమ్ విశ్వదేవ్ నటిస్తున్నాడు. అంతేకాదు, ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఒరిజినల్ కథ ప్రకారం, ఆమె విశ్వదేవ్‌కు జోడీగా కనిపించే అవకాశం ఉంది.

ఈ రీమేక్‌తో మరో ఆసక్తికరమైన వారసుడు దర్శకుడిగా పరిచయం కానున్నారు. లెజెండరీ మలయాళ దర్శకుడు ఐ.వి. శశి గారి అబ్బాయి, అనీ ఐ.వి. శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రాజశేఖర్ గారికి ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.

Leave a comment