నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా ‘NBK 111’. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇందులో హీరోయిన్ ఎవరు అనే దానిపై ‘ఆవిడ , ఈవెడే నా’ అన్నట్టు చాలా ఊహాగానాలు వినిపించాయి. వాటన్నిటికీ నేటితో తెరపడింది.
నయనతార పుట్టినరోజును పురస్కరించుకుని, మేకర్స్ ఒక అద్భుతమైన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘క్వీన్’గా నయనతార పాత్రను పరిచయం చేస్తూ, ఆమె సామ్రాజ్యంలోకి అడుగుపెడుతున్నట్టుగా వీడియోను ప్రజెంట్ చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సినిమాలో నయన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, ఒక మహారాణి తరహాలో ఉండబోతున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే స్పష్టమవుతోంది.
బాలకృష్ణ, నయనతారలది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి గతంలో ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి హిట్ సినిమాలను అందించారు. ‘పాత మిత్రులు’ మళ్లీ కలవడంతో, ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇది వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా.
నిజానికి, నవంబర్ 3నే ‘క్వీన్’ ఫస్ట్ లుక్ వస్తుందని ప్రకటించారు. కానీ, అనుకోని బస్సు ప్రమాదం కారణంగా ఆ ఈవెంట్‌ను వాయిదా వేశారు. కాస్త లేటైనా, ఇప్పుడు నయన్ పుట్టినరోజున ఈ గ్లింప్స్ విడుదల చేసి, అభిమానులకు డబుల్ కిక్ ఇచ్చారు.
గోపీచంద్ మలినేని తన మార్క్ మాస్ యాక్షన్‌కు హిస్టారికల్ డ్రామాను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలయ్య-నయన్-గోపీచంద్ కాంబోలో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

