రామ్ ‘ఆంధ్రా కింగ్’.. హిట్ టాక్ వచ్చినా బుకింగ్స్ డల్ !

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పరిస్థితి చూస్తుంటే అభిమానులకు ఆందోళన కలగక మానదు. ఒకప్పుడు వరుస హిట్ల‌తో దూసుకుపోయిన రామ్, గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి మాస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, ఆయన ఆశలన్నీ నేడు విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ పైనే పెట్టుకున్నాడు.

మహేష్ బాబు పాచిగోళ్ల దర్శకత్వంలో, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈరోజు (నవంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ మరియు మార్నింగ్ షోల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం విశేషం. ఫ్యాన్ ఎమోషన్స్, రామ్ నటన బాగున్నాయని రివ్యూలు కూడా వచ్చాయి. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది! సినిమాకు ‘హిట్’ టాక్ వచ్చినా, కలెక్షన్స్ మాత్రం ‘ఫట్’ అన్నట్టుగా ఉన్నాయి.

షాకింగ్ ఓపెనింగ్స్:

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓపెనింగ్స్ రామ్ కెరీర్ లోనే అత్యల్పంగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బుక్ మై షో  వంటి ప్లాట్‌ఫామ్స్‌లో గంటకు కేవలం 3 నుండి 4 వేల టికెట్లు మాత్రమే తెగుతున్నాయి. ఒక స్టార్ హీరో సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం నిజంగా షాకింగ్.

ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం రూ. 4 నుండి 5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టే అవకాశం ఉంది.

అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా సుమారు $40K – $80K వసూళ్లు వచ్చినా, డొమెస్టిక్ మార్కెట్ లో బజ్ లేకపోవడం చిత్ర యూనిట్ ను కలవరపెడుతోంది. క్లాస్ టచ్ ఉన్న ఎమోషనల్ డ్రామా కావడం, మాస్ ఎలిమెంట్స్ తగ్గడం వల్లే ఓపెనింగ్స్ డల్ గా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీకెండ్ లోపు మౌత్ టాక్ పెరిగి కలెక్షన్స్ పుంజుకుంటాయో లేదో చూడాలి.

Leave a comment