ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections 2025) నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ పంచాయతీల గడువు 2025 ఏప్రిల్ 2తో, మున్సిపాలిటీల గడువు మార్చి 17తో ముగుస్తుండటంతో, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు సై అంటోంది. కానీ, ప్రతిపక్ష వైసీపీ శిబిరంలో మాత్రం దీనిపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.
వైసీపీ వ్యూహం ఏంటి?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం (11 సీట్లు) తర్వాత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే “ప్రతిపక్ష హోదా” లేదనే కారణంతో అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన జగన్, ఇప్పుడు స్థానిక ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
బ్యాలెట్ పేపర్ పాట ..
విశ్వసనీయ సమాచారం ప్రకారం, వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి “బ్యాలెట్ పేపర్లు” కావాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈవీఎంల (EVMs) వల్లే తాము ఓడిపోయామని నమ్ముతున్న జగన్, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగకపోతే తాము దూరంగా ఉంటామని చెప్పే ఛాన్స్ లేకపోలేదు. అదే జరిగితే, అది అధికార కూటమికి (TDP+JSP+BJP) వాకోవర్ ఇచ్చినట్లే అవుతుంది.
మరోవైపు పులివెందుల టూర్ ) పేరుతో జగన్ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నా, గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి వేరుగా ఉంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినా, పరోక్షంగా పార్టీ మద్దతు ఉంటుంది. ఈ సమయంలో అధినేత “పోటీ వద్దు” అంటే, గ్రామీణ స్థాయిలో పార్టీ ఉనికికే ప్రమాదం అని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.
మొత్తానికి, “పులి” పంజా విసురుతుందా? లేక వ్యూహాత్మక మౌనం పాటిస్తుందా? అనేది రాబోయే నోటిఫికేషన్ తర్వాతే తేలనుంది.

