వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. గన్నవరం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన, అక్కడి నుంచి నేరుగా కోర్టుకు వెళ్లారు. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరుకు సంబంధించి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తూ ఆయన నేడు విచారణకు వచ్చారు.
జగన్ కోర్టు హాల్లో కేవలం ఐదు నిమిషాల పాటే ఉన్నారు. హాజరు నమోదు చేసుకున్న అనంతరం న్యాయమూర్తి అనుమతితో ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. “కోర్టు ఆదేశాల మేరకే జగన్ ఈరోజు హాజరయ్యారు. ప్రస్తుతం తదుపరి వాయిదాలకు ఆయన వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం లేదు. కోర్టు మళ్లీ ఆదేశించే వరకు ఆయన హాజరు నుంచి మినహాయింపు ఉంటుంది,” అని స్పష్టం చేశారు.
అంతకుముందు, జగన్ రాకతో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ ముగిసిన అనంతరం జగన్ బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ నివాసానికి వెళ్లారు. దారి పొడవునా అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, 2012 నాటి క్విడ్ ప్రో కో (Quid Pro Quo) కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ఇంకా కొనసాగుతోంది.

