వివాదాలకు కేరాఫ్ అడ్రస్, లాజిక్కులకు నిలువెత్తు రూపం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతంపై ఆర్జీవీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సినిమా పైరసీ చేసే ‘రవి’ అనే వ్యక్తిని సోషల్ మీడియాలో కొందరు ‘రాబిన్ హుడ్’తో పోల్చడంపై వర్మ మండిపడ్డారు.
రాబిన్ హుడ్ హీరో కాదు.. టెర్రరిస్ట్! ధనికుల దగ్గర దోచుకుని పేదలకు పంచే రాబిన్ హుడ్, నేటి చట్టాల ప్రకారం చూస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి టెర్రరిస్ట్ అని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు సంపాదించడమే నేరమన్నట్లుగా, సంపన్నులను దోచుకోవడం హీరోయిజం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. కేవలం దొంగిలించిన సరుకు (సినిమా) ఉచితంగా దొరుకుతోంది కదా అని ఒక నేరస్తుడిని సెయింట్‌లా కీర్తించడం అజ్ఞానానికి పరాకాష్ట అని నెటిజన్లకు చురకలంటించారు.
బీఎండబ్ల్యూ కారుని దొంగిలిస్తారా? “టికెట్ రేట్లు ఎక్కువ, పాప్‌కార్న్ రేట్లు ఎక్కువ.. అందుకే పైరసీ చూస్తున్నాం” అని చెప్పే వారి లాజిక్‌ను వర్మ చీల్చి చెండాడారు. ఆ లెక్కన బీఎండబ్ల్యూ కారు ఖరీదు ఎక్కువని షోరూమ్ పగలగొట్టి కార్లను అందరికీ పంచేస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఆలోచనా ధోరణి సమాజంలో అరాచకానికి దారితీస్తుందని హెచ్చరించారు. జనం డబ్బులు, సమయం ఆదా అవుతుందనే సౌకర్యం కోసమే పైరసీ చూస్తున్నారని, నైతిక విప్లవం కోసం కాదని తేల్చి చెప్పారు.
చూసేవాళ్లని లోపలేస్తేనే.. పైరసీని అరికట్టడానికి వర్మ ఒక డేంజర్ సొల్యూషన్ చెప్పారు. సప్లయ్ చేసేవాడిని పట్టుకోవడం కష్టం కాబట్టి, చూసేవాడిని పట్టుకోవాలట. “ఒక వంద మంది పైరసీ చూసేవాళ్లను ర్యాండమ్‌గా అరెస్ట్ చేసి, వాళ్ళ పేర్లు పేపర్లో వేయండి.. అప్పుడు అందరికీ భయం పుడుతుంది” అని వర్మ సలహా ఇచ్చారు. దొంగ సొత్తు కొనడం ఎంత నేరమో, లింక్ ఫార్వార్డ్ చేయడం కూడా అంతే నేరమని జనానికి అర్థం కావాలన్నారు. చివరగా.. “భయం పనిచేస్తుంది, నీతి వాక్యాలు పనిచేయవు” అంటూ తన మార్క్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
సినిమాలు లీక్ చేసే పైరేట్లను ‘రాబిన్ హుడ్’తో పోల్చడాన్ని రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. రేట్లు ఎక్కువని సాకు చూపి దొంగతనాన్ని సమర్థించలేమని, అది అరాచకానికి దారితీస్తుందని అన్నారు. పైరసీని అరికట్టాలంటే లింకులు పంపే వారిని, చూసే వారిని అరెస్ట్ చేసి భయం పుట్టించడమే ఏకైక మార్గమని వర్మ అభిప్రాయపడ్డారు.


ఎక్స్‌క్లూజివ్: ‘పెద్ది’లో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్.. రామ్ చరణ్ కుంటివాడిగా?
on December 3, 20250