భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, లేడీ సెహ్వాగ్ అని పిలుచుకునే స్మృతి మంధానా మరియు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదా పడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం. నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లిలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది.
అయితే, పెళ్లికి కొన్ని గంటల ముందు మంధానా తండ్రి శ్రీనివాస్ మంధానా గుండె సంబంధిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. దీంతో, తండ్రి ఆరోగ్యం ముఖ్యం అని మంధానా పెళ్లిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రెండు కుటుంబాలు అధికారికంగా ప్రకటించాయి. తర్వాత వరుడు పలాశ్ ముచ్చల్ కూడా తీవ్రమైన ఒత్తిడి, అస్వస్థత కారణంగా ఆసుపత్రి పాలయ్యారు.
కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. కుటుంబ సభ్యులు చెబుతున్నదొకటైతే, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు మరోలా ఉన్నాయి. పలాశ్ మోసం చేశాడు..అందుకే మంధానా పెళ్లిని రద్దు చేసుకుంది అనే ప్రచారం జోరందుకుంది.
పెళ్లి వేడుకలు మొదలైన తర్వాతే పలాశ్‌కు, ఒక మహిళకు మధ్య జరిగిన పాత ‘ఫ్లర్టీ చాట్స్’ స్క్రీన్‌షాట్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయని వార్తలు వచ్చాయి. మేరీ డికోస్టా అనే మహిళ ఈ చాట్‌లను షేర్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ జరిగింది. పలాశ్.. మంధానాతో తన బంధం ‘పాతబడిపోయిందని’ చెప్పి, మరో మహిళను డేటింగ్‌కు ఆహ్వానించినట్లు ఆ చాట్స్‌లో ఉన్నాయని నెటిజన్లు పేర్కొన్నారు.
ఈ విషయం తెలిసిన మంధానా తీవ్ర ఆవేదనకు లోనై, ఉన్నపళంగా పెళ్లిని ఆపేసిందని సమాచారం. మంధానా తండ్రికి గుండెపోటు రావడానికి కూడా.. పలాశ్‌ను నిలదీసిన గొడవ కారణం కావచ్చని పలువురు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా..మంధానా వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి నిశ్చితార్థం, ప్రపోజల్ వీడియోతో సహా పెళ్లి సంబంధిత పోస్టులన్నింటినీ తొలగించడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. మంధానా స్నేహితురాళ్లు, తోటి క్రికెటర్లు కూడా పలాశ్‌ను అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశమైంది.
మరోవైపు, పలాశ్ కుటుంబం ఈ పుకార్లను ఖండిస్తోంది. పలాశ్ తల్లి మాట్లాడుతూ.. “స్మృతి తండ్రితో పలాశ్‌కు చాలా అనుబంధం ఉంది. ఆ బాధతోనే అతడు ఆసుపత్రి పాలయ్యాడు” అని తెలిపారు. ఏది ఏమైనా, తన కెరీర్‌ను ఎంతో బలంగా నిలబెట్టుకున్న మంధానా.. వ్యక్తిగత జీవితంలో ఈ గందరగోళం నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తండ్రి డిశ్చార్జ్ అయినా, పెళ్లి ఎప్పుడు జరుగుతుందో మాత్రం ఇంకా స్పష్టత లేదు.

