హిల్టప్ (HILTP) పేరిట వేల కోట్ల భూమాయ? అసెంబ్లీలో తేల్చుకుందాం రా: హరీశ్ రావు సవాల్!

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న వేల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను కాంగ్రెస్ ప్రభుత్వం “హిల్టప్” (HILTP – Hyderabad Industrial Land Transformation Policy) పేరుతో అప్పనంగా బడా బాబులకు కట్టబెట్టేందుకు సిద్ధమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కొత్త పాలసీ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు.

“కంచే చేను మేసినట్లు”గా రాష్ట్ర సంపదను కాపాడాల్సిన ప్రభుత్వమే, 9,292 ఎకరాల విలువైన భూములను కేవలం 30 శాతం ధరకే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు స్కెచ్ వేసిందని హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ (SRO) కంటే 100 నుంచి 200 శాతం అధికంగా వసూలు చేశామని ఆయన గుర్తుచేశారు. కానీ, నేడు రేవంత్ రెడ్డి సర్కార్ మార్కెట్ విలువను పక్కనపెట్టి, అతి తక్కువ రేటుకు భూములు అమ్మేస్తోందని విమర్శించారు.

“ఐదు లక్షల కోట్ల విలువైన భూములను, కేవలం 5 వేల కోట్లకు అమ్మేస్తారా? ఈ దోపిడీ ఎవరి కోసం?” అని మంత్రి శ్రీధర్ బాబును ఆయన సూటిగా ప్రశ్నించారు. మార్కెట్ రేటు కాకుండా, తక్కువగా ఉండే ఎస్.ఆర్.ఓ (SRO) రేటును ప్రామాణికంగా తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. హెచ్‌ఎండీఏ కు రావాల్సిన రూ. 13,500 కోట్ల కన్వర్షన్ ఫీజులకు కూడా ఎగనామం పెట్టేలా ఈ పాలసీని రూపొందించారని ఆరోపించారు.

ఇదంతా ఆరు నెలల ముందస్తు వ్యూహంతో జరిగిన “ప్రీ-ప్లాన్డ్ స్కామ్” అని అభివర్ణించిన హరీశ్, దమ్ముంటే వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి దీనిపై చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల తరఫున బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై బీజేపీ మౌనం వహించడంపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

Leave a comment