2025 క్యాలెండర్ తిరగేస్తే.. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా వినిపించిన ఒకే ఒక్క పేరు ‘అనుపమ పరమేశ్వరన్’. ఈ ఏడాది అమ్మడి డైరీ ఫుల్ బిజీ. ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ అయితే అందులో నాలుగు బ్లాక్ బస్టర్స్ కొట్టి ‘గోల్డెన్ లెగ్’ అనిపించుకుంది. ముఖ్యంగా కెరీర్ డైలమాలో ఉన్న ముగ్గురు ఫ్లాప్ హీరోలకు అనుపమ లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి.
వరుస ప్లాపులతో సతమతమవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ‘కిష్కింధపురి’ రూపంలో పెద్ద రిలీఫ్ దొరికింది. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌గా నిలిచి, బెల్లంకొండకు మాస్ కంబ్యాక్ ఇచ్చింది.
ఇక స్టార్ కిడ్ అయినా సరే, సాలిడ్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న ధ్రువ్ విక్రమ్‌కు ‘బైసన్’ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చింది అనుపమ. మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా దాదాపు రూ. 65 కోట్లు కొల్లగొట్టి ధ్రువ్ రేంజ్‌ను మార్చేసింది. అటు మలయాళంలో షరాఫ్ ఉ ధీన్ సొంతంగా నిర్మించి, నటించిన ‘పెట్ డిటెక్టివ్’ కూడా సూపర్ హిట్ అయ్యింది. అక్కడ కూడా అనుపమ మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది.
సోలోగా మాత్రం బ్యాడ్ లక్:
హీరోల పక్కన హిట్లు కొడుతున్నా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయంలో మాత్రం అనుపమ టైం అస్సలు బాలేదు. ఈ ఏడాది వచ్చిన ‘పరదా’, ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (JSK) బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా పడ్డాయి. గ్లామర్ డాల్‌గా ఉన్నంత క్రేజ్, సోలో పెర్ఫార్మర్‌గా రావడం లేదనేది చేదు నిజం.
‘లాక్ డౌన్’పై నీలినీడలు:
ఇప్పుడు అందరి చూపు డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ‘లాక్ డౌన్’ సినిమాపైనే ఉంది. లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించినా, ఈ సినిమాపై బజ్ సున్నా. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా ఇన్నాళ్లకు బయటకు వస్తోంది.
ట్రైలర్ ఇంటెన్సిటీ లేకపోవడం, అనుపమ ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించకపోవడంతో జనం దీనిని లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. కేవలం రిలీజ్ చేయాలి కాబట్టి చేస్తున్నట్లు ఉంది తప్ప, సక్సెస్ మీద ఎవరికీ హోప్స్ లేనట్లు టాక్.
మొత్తానికి 2025 అనుపమకు కమర్షియల్‌గా అదిరిపోయే ఇయర్ అయినా.. సోలో హీరోయిన్‌గా మాత్రం ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.

