శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు అనంత లోకాలకు వెళ్లిపోయారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలను బలిగొంది.
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు భక్తులు వ్యానులో తీర్థయాత్రలకు వచ్చారు. శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. అయితే విధి వక్రించింది. వీరు ప్రయాణిస్తున్న వ్యాను ఎత్తురాళ్లపాడు సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యానులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన సింగ్ పవార్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), కుసాల్ సింగ్ (62), సంతోషి భాయ్ (62)గా గుర్తించారు.
“శతమానం భవతి” అని దీవించాల్సిన దేవుడు.. ఇలా అర్థాంతరంగా పిలిచేసుకున్నాడేంటి అని స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి దైవ చింతనతో వచ్చిన వారు.. ఇలా విగతజీవులుగా మారడం అందరినీ కలిచివేసింది.

