ఐబొమ్మ రవి ‘రాబిన్ హుడ్’ ఏంటి? అసలు గుట్టు విప్పిన బన్నీ వాసు.. ఆ లాజిక్ అదిరింది!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ సినిమాలను ముప్పుతిప్పలు పెట్టిన ‘ఐబొమ్మ’ అడ్మిన్ రవి అరెస్ట్ అయితే, నెటిజన్లు మాత్రం “నువ్వే మా హీరో.. పేదవాడికి వినోదాన్ని పంచిన రాబిన్ హుడ్” అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. టికెట్ రేట్లు పెంచేసి సామాన్యుడి జేబులు కొల్లగొడుతున్న నిర్మాతలకు రవి బుద్ధి చెప్పాడన్నది వారి వాదన. అయితే, ఈ వాదనలోని డొల్లతనాన్ని తనదైన శైలిలో బయటపెట్టారు నిర్మాత బన్నీ వాసు.

‘రాజు వెడ్స్ రాంబాయి’ ఈవెంట్‌లో బన్నీ వాసు మాట్లాడుతూ.. పైరసీని సమర్థించే వారిపై నిప్పులు చెరిగారు. “టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పైరసీ చూస్తున్నాం అని చెప్పడం పచ్చి అబద్ధం” అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఏడాదికి సుమారు 100 సినిమాలు రిలీజ్ అయితే, అందులో రేట్లు పెంచేది కేవలం 10-15 భారీ బడ్జెట్ సినిమాలకే. మరి మిగిలిన 85 చిన్న సినిమాలకు రేట్లు తక్కువగానే ఉంటున్నాయి కదా? వాటిని కూడా ఐబొమ్మలో ఎందుకు చూస్తున్నారు? అని బన్నీ వాసు సూటిగా ప్రశ్నించారు. ఈ లాజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“నిర్మాతలు అంటే అందరూ కోట్లు గడించే కుబేరులు అనుకుంటారు. కానీ పైన పటారం.. లోన లొటారం అన్నట్టు ఉంటుంది మా పరిస్థితి. ఒక సినిమా కోసం ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి రోడ్డున పడ్డ నిర్మాతలు ఎందరో ఉన్నారు. వాళ్ళు చొక్కా విప్పితే వెనుక వాతలు కనిపిస్తాయి,” అంటూ బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి తీసిన కంటెంట్ ను దొంగతనం చేస్తూ, దాన్ని గొప్పపనిగా చెప్పుకోవడం సమాజానికి మంచిది కాదని హితవు పలికారు.

మొత్తానికి, “ఇంటికి తాళం వేయలేదు కదా అని దొంగతనం చేయడం ఎంత తప్పో.. రేట్లు ఎక్కువని పైరసీ చూడటం కూడా అంతే తప్పు” అనే రేంజ్ లో బన్నీ వాసు క్లాస్ పీకారు. నిజమే మరి, మన వినోదం కోసం ఇంకొకరి కష్టాన్ని దోచుకోవడం సమంజసం కాదేమో నెటిజన్లు ఆలోచించుకోవాలి.

Leave a comment