పుట్టపర్తి గడ్డపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు గారు.. సత్యసాయి బాబా సేవలను ఆకాశానికెత్తేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పొలిటికల్ మీటింగుల్లో మైకు దొరికితే ప్రత్యర్థులపై విరుచుకుపడే చంద్రబాబు, ఈసారి మాత్రం పూర్తిగా ఆధ్యాత్మిక బాట పట్టారు. కానీ, అక్కడ కూడా తన మార్క్ ‘అడ్మినిస్ట్రేషన్’ పాఠాలు చెప్పకనే చెప్పారు.
“మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయి,” అంటూ బాబు గారు సాయి భక్తులను ఫిదా చేశారు. అయితే అసలు కిక్ ఎక్కడ వచ్చిందంటే.. “ప్రభుత్వాలు, వ్యవస్థలు కూడా చేయలేని పనులను సత్యసాయి ట్రస్ట్ చేసి చూపించింది,” అని అనడమే. అంటే, మన ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంటుందో, ట్రస్ట్ పనితీరు ఎంత వేగంగా ఉంటుందో పోల్చి చెప్పారన్నమాట. రూ.550 కోట్లు ఖర్చు పెట్టి 7.5 లక్షల మందికి తాగునీరు అందించడం అంటే మాటలా? బాబా గారు నిజం చేశారని గుర్తుచేశారు.
1960లోనే సేవా కార్యక్రమాలకు ఒక స్ట్రక్చర్ ఇచ్చిన విజనరీ సత్యసాయి అని కొనియాడారు. 102 స్కూళ్లు, రోజుకు 3 వేల మందికి వైద్యం.. ఇవన్నీ చూస్తుంటే, “మానవ సేవే మాధవ సేవ” అనే మాటను ఇంత పర్ఫెక్ట్‌గా అమలు చేయడం సాధ్యమా అనిపిస్తుంది. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా సేవ చేయడం వల్లే ప్రపంచ దేశాల అధినేతలు కూడా పుట్టపర్తి వైపు చూస్తున్నారని బాబు గుర్తుచేశారు.
మొత్తానికి బాబు గారు పుట్టపర్తి వచ్చి, సాయి బాబా భజన చేయడమే కాదు, నేటి రాజకీయ నాయకులకు, పాలకులు ‘సేవ’ అంటే ఎలా ఉండాలో సత్యసాయి జీవితం ద్వారా క్లాస్ పీకారు. శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పడం ద్వారా, తాము ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తామని సంకేతాలిచ్చారు. ఏది ఏమైనా, పుట్టపర్తిలో బాబు గారి స్పీచ్ విన్నాక, “భక్తిలో కూడా లాజిక్ వెతకడం బాబు గారికే చెల్లింది” అనిపించకమానదు.

