ఛాంపియన్ ‘గిర గిర’: పల్లె మట్టి వాసనతో మైమరపించే మెలోడీ.!

యువ కథానాయకుడు రోషన్ మేక నటిస్తున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ నుంచి తొలి పాట ‘గిర గిర గింగిరాగిరే’ విడుదలై యూత్‌ని మెస్మరైజ్ చేస్తోంది. మెలోడీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన ఈ పాట.. పల్లె వాతావరణాన్ని, స్వచ్ఛమైన ప్రేమను కళ్లకు కట్టినట్టుగా చూపించింది. పాట వింటుంటే మట్టి వాసన మనసుకి హత్తుకున్నట్టుగా ఒక కొత్త అనుభూతిని ఇస్తోంది. అందుకే ఈ మెలోడీకి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన దక్కింది.

మలయాళీ ముద్దుగుమ్మ ఎంట్రీ!

ఈ సినిమాతో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వస్తున్న ఈ ‘ఛాంపియన్’ చిత్రం.. పీరియడ్ స్పోర్ట్స్-లవ్-యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాతోనే మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆమె ఇందులో చంద్రకళ అనే బలమైన పాత్రను పోషిస్తోంది.

రోషన్ పోషిస్తున్న మైఖేల్ సి విలియమ్స్ (ఫుట్‌బాల్ ప్లేయర్) పాత్రకు, చంద్రకళకు మధ్య ఉన్న ప్యూర్ లవ్ స్టోరీని, వారి కలలను ‘గిర గిర’ పాట హైలైట్ చేసింది. ప్రీ-ఇండిపెండెన్స్ కాలంలో సెట్ అయిన ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి సెట్టింగ్స్, సినిమాటోగ్రాఫర్ మధి విజువల్స్ అబ్బుర పరుస్తున్నాయి.

మిక్కీ మ్యూజిక్, రామ్ గాత్రం మ్యాజిక్!

నిజం చెప్పాలంటే, మిక్కీ జే మేయర్ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ మెలోడీలలో ఇది ఒకటి. ‘సంతోషాన్ని, ఉల్లాసాన్ని, పల్లెటూరిలోని ఆత్మీయ బంధాలను’ తెలియజేసేలా ఈ కంపోజిషన్ సాగింది. దీనికి తోడు, కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం ప్రతి తెలుగు గుండెకూ చేరువయ్యేలా ఉంది. ముఖ్యంగా, సింగర్ రామ్ మిరియాల తన ప్రత్యేకమైన గాత్రంతో పాటకు మరింత మ్యాజిక్‌ను జోడించాడు.

ఇక తెరపై.. రోషన్ ఎనర్జిటిక్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తే, అనస్వర రాజన్ తన చిరునవ్వుతో చంద్రకళ పాత్రలో ప్రాణం పోసింది. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా, ఆహ్లాదకరంగా ఉండటంతో పాట ప్రేక్షకులకు మరింత చేరువైంది. ‘సీతారామం’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ‘ఛాంపియన్’ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ‘గిర గిర’ మెలోడీ ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a comment