ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కామ్ కేసులో ఒక ముఖ్యమైన మలుపు చోటు చేసుకుంది. ముగ్గురు కీలక నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు లొంగిపోవాల్సిన ఆ ముగ్గురు.. సుప్రీంకోర్టు స్టేతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ కేసులో ప్రధానంగా తెరపైకి వచ్చిన వారు.. మాజీ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లో పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే. ధనుంజయ రెడ్డి, ముఖ్యమంత్రికి మాజీ ఓఎస్‌డీ పీ. కృష్ణ మోహన్ రెడ్డి, అలాగే భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప. ఈ మూడు పేర్లూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల లిక్కర్ అక్రమాలతో ముడిపడి ఉన్నాయి.
నిజానికి, ఈ ముగ్గురు నిందితులకు గతంలో విజయవాడ ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సిట్ హైకోర్టును ఆశ్రయించింది. నిందితులు బయట ఉంటే సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని సిట్ వాదించింది. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. ఇటీవల వారి డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేస్తూ, వెంటనే ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలతో నిందితులకు సరెండర్ తప్పనిసరైన సమయంలో.. వారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. దీనివల్ల, తదుపరి విచారణ పూర్తయ్యే వరకు వారు లొంగిపోవాల్సిన అవసరం లేదు.
ఈ పరిణామంతో సిట్ అధికారులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. దీనికి ప్రతిగా, సుప్రీంకోర్టు సిట్‌ను ఉద్దేశించి కీలక ఆదేశాలు ఇచ్చింది. 10 రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 15వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
నిందితుల తరఫున సీనియర్ అడ్వకేట్లు ఆర్యమా సుందరం, నిరంజన్ రెడ్డి తమ వాదనలు గట్టిగా వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయకోవిదులు సిద్ధార్థ్ లూథ్రా, ముకుల్ రోహత్గీ వాదించారు. ఎంతమంది హేమాహేమీలు రంగంలోకి దిగినా.. ప్రస్తుతానికి నిందితులకే తాత్కాలికంగా ఊరట దక్కినట్లైంది. వేల కోట్ల కుంభకోణం, షెల్ కంపెనీల ద్వారా అక్రమ సొమ్ము తరలింపు వంటి ఆరోపణలతో సాగుతున్న ఈ కేసులో.. సుప్రీంకోర్టు తీర్పు అత్యంత కీలకంగా మారనుంది. డిసెంబర్ 15న కేసు భవితవ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

