పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ పై సంచలనం! రీమేక్ కాదు…పక్కా ఒరిజినల్!

డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక మాంచి కిక్కిచ్చే వార్త బయటకు వచ్చింది. దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (UBS) పై ఉన్న చాలా కాలం అనుమానాలకు తెరపడింది. ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబో కావడంతో, ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పనవసరం లేదు.

అయితే, ఈ సినిమా తమిళంలో విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘తేరి’ (తెలుగులో ‘పోలీసోడు’) కి రీమేక్ అనే ప్రచారం కొన్నాళ్లుగా గట్టిగా సాగింది. ఇప్పటికే ఆ సినిమాను జనాలు చాలాసార్లు చూశారు కాబట్టి, రీమేక్ చేయడం పట్ల పవన్ ఫ్యాన్స్‌లో కాస్త ఆందోళన కనిపించింది.

తాజాగా ఈ విషయంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన వై. రవి శంకర్ కీలక క్లారిటీ ఇచ్చారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మొదట్లో ‘తేరి’ రీమేక్‌గానే ప్రారంభించిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. కానీ, ఆ తర్వాత కథ, స్క్రిప్ట్‌ను పూర్తిగా మార్చేసి, పవన్ కళ్యాణ్ ఇమేజ్, ప్రస్తుత రాజకీయాలకు తగినట్టుగా కొత్త కథను రెడీ చేశామని స్పష్టం చేశారు.

“సినిమా చూసేటప్పుడు ఇది ఎక్కడా రీమేక్ అనే ఫీలింగ్ అస్సలు రాదు. హరీష్ శంకర్ ఈ కథ కోసం తన ప్రాణం పెట్టేశారు,” అని రవి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పుడు పక్కా ఒరిజినల్ కథతో ప్రేక్షకులను పలకరించనుందన్నమాట. రీసెంట్‌గా విడుదలైన OG సినిమా ఫ్యాన్స్‌కి ఎలాంటి కిక్ ఇచ్చిందో, UBS అంతకు పది రెట్లు ఎక్కువ కిక్ ఇస్తుందని నిర్మాత ఘంటాపథంగా చెప్పారు. ఈ స్టేట్‌మెంట్‌తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

సినిమా షూటింగ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ తన భాగం షూటింగ్‌ను చకచకా పూర్తిచేశారు. మిగిలిన కీలక సన్నివేశాలు, ఇతర నటీనటుల షూటింగ్‌ను ఈ నెలాఖరుకి ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తోంది. రాశీ ఖన్నా కూడా కీలక పాత్రలో కనిపించనుంది. దేవి శ్రీ ప్రసాద్ మాస్ బీట్స్‌తో సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ యాక్షన్ డ్రామాను ఏప్రిల్ 2026 మూడవ వారంలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Leave a comment