ప్రముఖ కోలీవుడ్ నటుడు, నిర్మాత విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు చెల్లించాల్సిన కోట్ల రూపాయల అప్పుల విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విశాల్ దివాళా (బ్యాంక్‌రప్ట్) తీసినట్టు అధికారికంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించడం ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
విశాల్ అప్పు కథ ఏమిటంటే..
ఈ వివాదం చాలా పాతది. 2019లో విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ తరఫున ఫైనాన్షియర్ అన్బుచెళియన్ (గోపురం ఫిల్మ్స్) నుంచి రూ.21.29 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ తర్వాత ఆ రుణ బాధ్యతను లైకా ప్రొడక్షన్స్ స్వీకరించింది. రుణం పూర్తిగా తీర్చేవరకు విశాల్ నిర్మించే చిత్రాల హక్కులు లైకా సంస్థ అధీనంలోనే ఉంటాయనేది ఒప్పందం.
అయితే, విశాల్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సినిమాలను విడుదల చేయడం, అప్పు తీర్చకపోవడంతో లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం, జూన్ 2025లో సింగిల్ జడ్జి.. విశాల్ రూ.21.29 కోట్ల ప్రధాన మొత్తానికి అదనంగా 30 శాతం వడ్డీతో కలిపి మొత్తం రూ.30.05 కోట్లు చెల్లించాల్సిందే అని తీర్పునిచ్చింది.
‘దివాళా’ ప్రకటనపై కోర్టు ప్రశ్న..
ఈ తీర్పుపై విశాల్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. తాజాగా ఈ అప్పీల్ విచారణకు వచ్చినప్పుడు, విశాల్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. “మా క్లయింట్ (విశాల్) ఏమంత ధనవంతుడు కాదు. ఒక పెద్ద హీరో అని చెప్పుకున్నా, ప్రస్తుతం ఆయన ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు” అని కోర్టుకు తెలిపారు.
దీనిపై న్యాయమూర్తులు ఎస్.ఎం. సుబ్రమణియం, మహమ్మద్ షఫీక్ స్పందిస్తూ.. “కోట్లాది రూపాయల లావాదేవీల్లో ఉండి, ఇప్పుడు ‘ధనవంతుడిని కాను’ అని చెప్పడం ఎంతవరకు సమంజసం? అయితే, మీరు దివాళా తీసినట్టు అధికారికంగా కోర్టుకు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా?” అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ కఠిన వ్యాఖ్యలు విశాల్‌ను ఇరుకున పెట్టేశాయి.
అధిక వడ్డీపై హైకోర్టు అభ్యంతరం..
అయితే, ఈ సందర్భంగా న్యాయమూర్తులు లైకా సంస్థ వసూలు చేస్తున్న 30 శాతం వడ్డీ రేటుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అధిక వడ్డీల చట్టానికి వ్యతిరేకం కావచ్చని, అంతటి దోపిడీని కోర్టు అంగీకరించబోదని వ్యాఖ్యానించారు.
కేవలం వడ్డీ కారణంగానే అప్పు రూ.40 కోట్లకు మించి పోయిందని విశాల్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వడ్డీ రేటుపై తదుపరి విచారణ జరిపేందుకు బెంచ్ అంగీకరించి, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించినట్టు సమాచారం. ఈ మొత్తం వివాదం తమిళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది.

