కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పైరసీ భూతం I BOMMA. కొత్త సినిమా థియేటర్‌లో పడిందో లేదో, గంటల వ్యవధిలోనే హెచ్‌డీ క్వాలిటీతో ఈ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యేది. దీనివల్ల నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ఈ పైరసీ రాకెట్‌పై ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, దీని సూత్రధారి ఇమ్మడి రవిని అరెస్టు చేశారు.
ఈ అరెస్ట్ నేపథ్యంలో, టాలీవుడ్ అగ్ర నిర్మాతలు, హీరోలు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజు వంటి ప్రముఖులు సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. పైరసీని అరికట్టాలని గట్టిగా కోరారు. ఈ సమావేశం అనంతరమే సీపీ సజ్జనార్ మీడియాకు విస్తుపోయే నిజాలు వెల్లడించారు.
పైరసీ అనుకుంటే.. డేటా బ్రీచ్.!
అందరూ iబొమ్మను కేవలం పైరసీ వెబ్‌సైట్‌గా చూస్తుండగా, సజ్జనార్ చెప్పిన విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది. “I BOMMA వెబ్‌సైట్‌లో 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో వ్యక్తిగత సమాచారం ఒకరి వద్ద ఉండటం చాలా ప్రమాదకరం” అని సజ్జనార్ తెలిపారు. అంటే, సినిమాలు ఫ్రీగా చూస్తున్నామని మురిసిపోయిన లక్షలాది మంది యూజర్ల డేటా ఇప్పుడు నేరగాళ్ల చేతికి చిక్కినట్లే.
20 కోట్లు.. 65 వెబ్‌సైట్లు..!
ఇమ్మడి రవి ఈ పైరసీ సామ్రాజ్యాన్ని మామూలుగా నడపలేదు. “దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు” అన్నట్లు, యూజర్ల డేటాను కూడా అడ్డం పెట్టుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం ద్వారా రవి సుమారు 20 కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి 3 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 65 మిర్రర్ వెబ్‌సైట్లను నడుపుతూ పోలీసుల కళ్లుగప్పాడు. ఒక వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే, వెంటనే మరో దాంట్లో సినిమాలు అప్‌లోడ్ చేసేవాడు.
యూకే నుంచి సర్వర్లు, వీపీఎన్‌లు వాడుతూ, ‘గెట్టింగ్ అప్’, ‘ఈఆర్ ఇన్ఫోటెక్’ అనే కంపెనీల పేర్లతో ఈ దందా నడిపాడు. రవి హార్డ్ డిస్క్‌లను పరిశీలిస్తే, 1972 నాటి ‘గాడ్‌ఫాదర్’ నుంచి నిన్నటి ‘ఓజీ’ వరకు.. ఏకంగా 21,000 సినిమాలు ఉన్నాయంటే ఇతని నెట్‌వర్క్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్..!
కేవలం పైరసీ, డేటా దొంగతనమే కాదు, ఇమ్మడి రవి సమాజానికి మరో రకంగానూ నష్టం చేకూర్చాడు. తన వెబ్‌సైట్ల ద్వారా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశాడు. ఈ బెట్టింగ్ యాప్‌ల వలలో పడి ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకున్నారు.
ప్రస్తుతం రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద 4 కొత్త కేసులు, పాతవి 7 కేసులు నమోదు చేశారు. ఈ కేసు లోతుపాతులను తేల్చేందుకు జాతీయ దర్యాప్తు సంస్థల సహాయం కూడా తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు.

