రివ్యూ: ప్రేమంటే

నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల, వెన్నెల కిషోర్, హైపర్ ఆది తదితరులు.
సంగీతం: లియోన్ జేమ్స్
ఛాయాగ్రహణం: విశ్వనాథ్ రెడ్డి Ch.
దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: జాన్వి నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు.

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమంటే: థ్రిల్ ప్రాప్తిరస్తు’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ‘కోర్ట్’ లాంటి క్లాసిక్ తర్వాత ప్రియదర్శి నుండి వచ్చిన ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీపై సినీ వర్గాల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా బుల్లితెర రాణి సుమ కనకాల కీలక పాత్రలో కనిపించడం మరింత ఆసక్తిని పెంచింది.

దర్శకుడు నవనీత్ శ్రీరామ్ కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకున్నప్పటికీ, దానిని నడిపించడంలో మాత్రం తడబడ్డాడు. మధు (ప్రియదర్శి) మరియు రమ్య (ఆనంది) లవ్ మ్యారేజ్ చేసుకున్న కొత్త జంట. మధు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపిస్తాడు. కానీ, అసలు ట్విస్ట్ ఏంటంటే.. అతను పక్కా ప్రొఫెషనల్ దొంగ!

ఈ సత్యాన్ని తెలుసుకున్న రమ్య.. భయపడకుండా, విడిపోకుండా… తన భర్తకు తోడుదొంగగా మారిపోతుంది. ఇక్కడ నుంచే కథనం సరదాగా, కొత్తగా మారుతుందని ప్రేక్షకులు ఊహించినా, దానికి తగ్గ స్క్రీన్‌ప్లే లభించలేదు.

మొదటి అర్ధభాగంలో ప్రియదర్శి, ఆనందిల మధ్య రొమాన్స్, కొన్ని ఫన్నీ సీన్స్ బాగున్నా, దొంగతనం కోణం వచ్చిన తర్వాత, కథనం వేగం కోల్పోయింది. కథనం, పాత్రచిత్రణ బాగా ఉంటే ఏ చిన్న సినిమా అయినా ప్రేక్షకులను మెప్పించగలదు కదా? కానీ ఇక్కడ బలమైన కథనం లేకుండానే థ్రిల్ ఇవ్వాలని ప్రయత్నించారు. దీనివల్ల లాజిక్‌కు దొరకని సన్నివేశాలు ఎక్కువయ్యాయి.

ఆనంది నటనలో మంచి మార్కులు కొట్టేసింది. పాత్రలో ఉన్న కన్ఫ్యూజన్‌ను, ఆ తర్వాత దొంగతనాలకు అలవాటుపడిన ఆనందాన్ని బాగా పలికించింది. అయితే, పవిత్రమైన అమ్మాయి పాత్ర ఒక్కసారిగా క్రైమ్ పార్ట్‌నర్‌గా మారడం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఈ పాత్ర చిత్రణలో చాలా అసంగతి ఉంది.

ఇక సుమ కనకాల, వెన్నెల కిషోర్ హెడ్ కానిస్టేబుల్, ఎస్సై పాత్రల్లో నవ్వించడానికి ప్రయత్నించినా, బలహీనమైన రైటింగ్ వల్ల వారి కామెడీ ట్రాక్ కూడా కొన్నిచోట్ల పేలవంగా మారింది. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ లాంటి కమెడియన్లను కూడా దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. టెక్నికల్‌గా సినిమా పర్వాలేదు. లియోన్ జేమ్స్ సంగీతం ఫరవాలేదు కానీ, నేపథ్య సంగీతం మాత్రం కొన్ని చోట్ల అవసరానికి మించి లౌడ్‌గా ఉంది.

మొత్తంగా చూస్తే.. “ప్రేమంటే” టైటిల్‌కి తగ్గ ఎమోషన్, “థ్రిల్ ప్రాప్తిరస్తు” అన్న క్యాప్షన్‌కి తగ్గట్టుగా థ్రిల్ లేకపోవడం పెద్ద లోటు. ఒక మంచి పాయింట్‌ను తీసుకుని, దానికి సరైన స్క్రీన్‌ప్లే ఇవ్వలేక సినిమా అసంపూర్ణంగా మిగిలిపోయింది. లాజిక్‌లు పట్టించుకోకుండా, కేవలం టైంపాస్ కోసం చూస్తే కొంత ఎంటర్‌టైన్‌మెంట్ దొరకవచ్చు, కానీ గొప్ప సినిమాను మాత్రం ఆశించలేం.

Leave a comment