CRICKET: టీమిండియా చరిత్రలోనే అత్యంత ఘోర ఓటమి..గంభీర్ కే అన్నీ చివాట్లు.!

భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టెస్టుల్లో టీమిండియా కథ అడ్డం తిరిగింది. వైట్-బాల్ క్రికెట్‌లో విజయాలు దక్కినా, రెడ్-బాల్ ఫార్మాట్‌లో మాత్రం ఘోరమైన పరాజయాలు అభిమానులను కలవర పెడుతున్నాయి. 2024 జూలైలో గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాక, సొంత గడ్డపైనే టీమిండియా పట్టు కోల్పోయింది.

తాజాగా, నవంబర్ 2025లో సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఎదురైన వైట్‌వాష్ (0-2) భారత క్రికెట్ చరిత్రలోనే ఒక చేదు అధ్యాయం. గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. రికార్డుల చరిత్రలో, సొంత గడ్డపై టీమిండియాకి ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం.

మొదటి టెస్టు కోల్‌కతాలో ఓడినా, గువాహటిలో కనీసం డ్రా చేసుకునే అవకాశం ఉన్నా చేజార్చుకుంది. చివరి ఇన్నింగ్స్‌లో 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా ఒక్కడే 54 పరుగులు చేసి కాస్తో కూస్తో పోరాటం చూపించినా ఫలితం దక్కలేదు. ఈ దెబ్బతో సౌతాఫ్రికా 25 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు టీమిండియాకి కంచుకోటలా ఉండే హోమ్ గ్రౌండ్‌, ఇప్పుడు సాధారణ పిచ్‌లా మారిపోయింది.

కోచ్ ప్రయోగాలే కొంప ముంచాయా?

గంభీర్ కోచింగ్‌పై మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా, అతడి ప్రయోగాలే జట్టు సమతుల్యతను దెబ్బతీస్తున్నాయనేది విశ్లేషకుల మాట. జట్టులో నిలకడ లేదు. కేవలం 18 టెస్టుల్లోనే ఏకంగా ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లను నెం.3 స్థానంలో ఆడించారు. కోచ్‌గా తాను ఒక మోనార్క్ లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి.

అంతేకాదు, స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లను సిద్ధం చేయాలని కోచ్ పట్టుబట్టారని, కానీ ఆ వ్యూహం బెడిసికొట్టి, భారత బ్యాటర్లనే ఇబ్బంది పెట్టిందని తెలుస్తోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3 వైట్‌వాష్ (2024) తర్వాత, ఇప్పుడిది వరుసగా రెండో హోమ్ సిరీస్ పరాజయం. గంభీర్ హయాంలో భారత్ ఇప్పటివరకు ఆడిన 18 టెస్టుల్లో 10 ఓటములు చవిచూసింది. ఇది టెస్టుల్లో టీమిండియా ప్రమాణాలను పూర్తిగా దిగజార్చింది.

విమర్శలు ఎక్కువ కావడంతో, గంభీర్ కూడా స్పందించారు. “ప్రతి వైఫల్యానికి బాధ్యత నాదే, కానీ ఇంగ్లండ్‌లో విజయం సాధించింది కూడా నేనే” అని తన గెలుపుల్ని గుర్తు చేశారు. అయితే, వరుసగా వస్తున్న ఈ పరాజయాలు టెస్టు క్రికెట్‌లో టీమిండియా భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బీసీసీఐ త్వరలోనే కోచ్‌ పదవిపై ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Leave a comment