అమరావతి రైతుల ఆవేదన: ‘మా బాబు’ వచ్చినా కష్టాలు తీరలేదా?

“రాజధాని మాది.. భవిష్యత్తు మనది” అని నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంతో పోరాటం చేసిన రైతులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ కష్టాలు తీరుతాయని ఆశపడ్డారు. కానీ, ప్రభుత్వం మారి ఏడాదిన్నర కావస్తున్నా, తమ గోడు వినే నాథుడే కరువయ్యారని రైతులు వాపోతున్నారు.

మళ్లీ మొదలైన ఆందోళన గతంలో మాజీ సీఎం జగన్‌పై యుద్ధం చేసిన రైతులు, ఇప్పుడు తమ అభిమాన నేత చంద్రబాబును కలవడానికి కూడా నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఎకరం, రెండు ఎకరాలు ఇచ్చిన చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్లాట్ల కేటాయింపులో వివక్ష, ఆడంగల్ రికార్డుల కోసం సీఆర్డీఏ (CRDA) ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారుల నుంచి స్పందన లేదన్నది ప్రధాన ఆరోపణ.

మంత్రి నారాయణ మాటేమిటి?

రాజధాని వ్యవహారాల మంత్రి నారాయణ, ఎంపీ పెమ్మసాని, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ ఇటీవల రైతులతో భేటీ అయ్యింది. “మరో ఆరు నెలల్లో  సమస్యలన్నీ పరిష్కరిస్తాం, జనవరి 2026 నుండి మౌలిక వసతుల పనులు మొదలుపెడతాం” అని హామీ ఇచ్చారు. కానీ, బ్యాంకులు రైతులకు కేటాయించిన ప్లాట్లపై రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తుండటం, లంక భూముల సమస్య నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) పరిధిలో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అధికారుల తీరుపై అసహనం:

సీఆర్డీఏ అధికారులు తమను చిన్నచూపు చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు ఎకరం రూపాయికే లీజుకు ఇస్తున్న ప్రభుత్వం, త్యాగం చేసిన రైతులకు ప్లాట్లు ఇవ్వడానికి ఎందుకు కొర్రీలు వేస్తోందని ప్రశ్నిస్తున్నారు. “నాడు జెండాలు పట్టుకుని పోరాడాం, నేడు వినతిపత్రాలు పట్టుకుని వేచిచూస్తున్నాం” అని రైతులు సెటైర్లు వేస్తున్న పరిస్థితి.

తాజాగా సీఎం చంద్రబాబు మరోసారి దీనిపై సమీక్ష నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరి ఈసారైనా హామీలు అమలవుతాయా లేక ఆరు నెలల గడువు మరో ఆరు నెలలు పొడిగించబడుతుందా అనేది వేచి చూడాలి.

Leave a comment