‘బలగం’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన దర్శకుడు వేణు యెల్దండి పరిస్థితి చూస్తుంటే “అయ్యో పాపం” అనక తప్పదు. హిట్ కొట్టి రెండేళ్లు దాటుతున్నా, ఆయన తర్వాతి సినిమా ‘ఎల్లమ్మ’ మాత్రం పట్టాలెక్కడం లేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మహానటి కీర్తి సురేష్ చెప్పిన మాటలు దిల్ రాజు కాంపౌండ్‌లో బాంబ్ పేల్చాయనే చెప్పాలి.
అసలేం జరిగిందంటే.. వేణు రాసుకున్న ‘ఎల్లమ్మ’ కథ చుట్టూ గత కొంతకాలంగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొదట నాని, సాయి పల్లవి అనుకున్నారు. వాళ్లు బిజీ అని తప్పుకున్నారు. తర్వాత నితిన్ వచ్చాడు, ‘తమ్ముడు’ దెబ్బతో వెనక్కి తగ్గాడు. ఇక లాభం లేదని మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (DSP)ను హీరోగా పెట్టి ప్రయోగం చేయడానికి దిల్ రాజు రెడీ అయ్యారని టాక్ వచ్చింది. ఈ క్రేజీ కాంబినేషన్లో కీర్తి సురేష్ హీరోయిన్ అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. జనవరి 2026లో షూటింగ్ అని కూడా ఫిక్స్ అయిపోయారు.
కానీ, సీన్ కట్ చేస్తే.. కీర్తి సురేష్ అసలు ట్విస్ట్ ఇచ్చింది. రేపు (నవంబర్ 28) రిలీజ్ అవుతున్న తన సినిమా ‘రివాల్వర్ రాణి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో “ఎల్లమ్మ సినిమా చేస్తున్నారా?” అని అడిగితే.. “నేను ఆ సినిమాలో లేను” అని సింపుల్‌గా తేల్చి చెప్పేసింది. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. మరి ఇన్నాళ్లు వినిపించిన వార్తలన్నీ గాలివార్తలేనా? లేక కీర్తికి కథ నచ్చలేదా? అనేది సస్పెన్స్.
మరోవైపు కీర్తి సురేష్ పెళ్లి గురించి కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. డిసెంబర్లో గోవా వేదికగా ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోందని, అందుకే కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, చేతిలో స్క్రిప్ట్ ఉంది, నిర్మాత రెడీగా ఉన్నారు.. కానీ నటీనటులే దొరకడం లేదు. పాపం వేణు నిరీక్షణ ఇంకెన్నాళ్లో చూడాలి!

