కోనసీమ కొబ్బరికి పవన్ కళ్యాణ్ దిష్టి మాట: బీఆర్ఎస్‌కు కొత్త ఊపు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ఒక చిన్న వ్యాఖ్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద అలజడి సృష్టిస్తోంది.

ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలులో జరిగిన ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమంలో కొబ్బరి రైతుల సమస్యలపై పవన్ మాట్లాడారు.

ఈ సందర్భంగా, కోనసీమ పచ్చదనాన్ని పొగుడుతూ… “మన కోనసీమ అందాన్ని చూసి తెలంగాణ నేతలు ఈర్ష్య పడ్డారు. అందుకే కొబ్బరి చెట్లకు ‘తెలంగాణ దిష్టి’ తగిలి మొండెం లేని చెట్లుగా మారాయి” అని సరదాగా వ్యాఖ్యానించారు. నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందనే సామెతను కూడా గుర్తు చేశారు.

పవన్ కళ్యాణ్ ఈ మాట అనగానే, తెలంగాణలో అదనుకోసం ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ నేతలకు ఇది “కొబ్బరి చిప్ప దొరికినట్లు” అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం కోసం చూస్తున్న బీఆర్ఎస్ దీనిని వెంటనే అందిపుచ్చుకుంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన జగదీష్ రెడ్డి అత్యంత తీవ్రంగా స్పందించారు. సూర్యాపేటలో మాట్లాడిన ఆయన, పవన్ కళ్యాణ్‌వి ‘తెలివితక్కువ మాటలు’, ‘మైండ్‌లెస్’ కామెంట్స్ అని విమర్శించారు. “కోనసీమకు తెలంగాణ దిష్టి తగలడానికి అక్కడికి ఎవరు వెళ్లారు? ఇక్కడికి (హైదరాబాద్‌కు) భారీగా వచ్చి మనపై దిష్టి పెడుతున్నది మీరే కదా!” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

“నోటిని, మెదడును అదుపులో పెట్టుకోలేని వారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు” అంటూ జగదీష్ రెడ్డి పవన్ పై సెటైర్లు వేశారు. కావాలంటే కోనసీమ కొబ్బరి తోటల్లో దిష్టిబొమ్మలు పెట్టుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) సెంటిమెంట్ రాజకీయంతో రెండుసార్లు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పవన్ మాటలను పట్టుకుని, బీఆర్ఎస్ తిరిగి సెంటిమెంట్ రాజేసి లబ్ధి చేకూర్చుకోవాలని అనుకోవడం సహజం.చూద్దాం ఈ రచ్చ ఎంతవరకు ముందుకు వెళ్తుందో..!?

Leave a comment