పవన్ వ్యూహం ఔట్ డేటెడ్: ఇక వైసీపీపై విమర్శలు పనిచేయవా..!?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయ అస్త్రం ఇప్పుడు పవర్ కోల్పోతుందా? అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనాని.. ఇటు ప్రజల దృష్టిని, అటు పార్టీ శ్రేణుల ఆశలను నెరవేర్చేందుకు కొత్త వ్యూహాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీని విమర్శించడం, జగన్ పాలన లోపాలను ఎత్తి చూపడం చాలా సులువుగా ఉండేది. ఆ నెగెటివ్ రాజకీయం పవన్‌కు బాగా కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తాము అధికారంలో ఉండి కూడా పాత ప్రభుత్వంపై నెపం వేస్తే, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. హానీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక చేయాల్సింది హామీల అమలు, సమస్యల పరిష్కారం మాత్రమే.

కోనసీమలో ‘40 ఏళ్ల’ షాక్..!

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌కు ఇటీవల కోనసీమ పర్యటనలో పెద్ద షాక్ తగిలింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రపు నీరు పొలాల్లోకి వచ్చి కొబ్బరి తోటలు నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్యపై స్పందించడానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో రంగంలోకి దిగిన పవన్, గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు గుప్పించారు.

అయితే, అక్కడే ఉన్న ఒక రైతు అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ కొబ్బరి తోటల సమస్య కేవలం ఐదేళ్లది కాదని, ఏకంగా 40 ఏళ్లుగా ఉందని స్పష్టం చేశారు. దీంతో పవన్ కల్యాణ్ ఒక్కసారిగా కంగుతినాల్సి వచ్చింది.

సమస్య మూలాలను పూర్తిస్థాయిలో తెలుసుకోకుండా, గత ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ‘కోనసీమ రైతుల గొంతుకగా ఉంటా’ అని పవన్ చెప్పిన మాట కూడా, రాజకీయ నాయకుడి మాటలా కాకుండా సినిమా డైలాగ్‌లా ఉందని కామెంట్లు వినిపించాయి.

పదిహేనేళ్ల హామీతో “పవర్” లాస్..!

ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. కొబ్బరి రైతుల సమస్యలపై పర్యటించిన పవన్ కల్యాణ్, కూటమి ప్రభుత్వానికి మరో పదిహేనేళ్లు అధికారం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రకటించారు. ఐదేళ్లు పాలించిన జగన్‌ను విమర్శించే క్రమంలో, చంద్రబాబు నాయుడు దాదాపు 17 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదనే ప్రశ్నను వైఎస్సార్సీపీ శ్రేణులు నెట్టింట సంధిస్తున్నాయి.

మరోవైపు, జనసేన శ్రేణులు, కాపు సామాజికవర్గం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నాయి. కానీ, గతంలో ఆయనే చంద్రబాబు పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించడం వలన, ఇటు సీఎం అస్త్రం, అటు విమర్శల అస్త్రం పవన్‌కు దూరమైనట్టుగా కనిపిస్తోంది.

కొత్త అస్త్రం కోసం తర్జనభర్జన..!

మరి కూటమిలో ఉంటూ పవన్ కల్యాణ్ ప్రజల్లో తన హీరో ఇమేజ్‌ను ఎలా నిలబెట్టుకోవాలి? కేవలం చేసిన మంచిని చెప్పుకోవడం ద్వారా రాజకీయాల్లో లబ్ది పొందడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో, విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని అమరావతి రైతుల సమస్యలు, సొంత పార్టీ ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలు వంటి కీలక అంశాలపై పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం కూడా ఇబ్బందిగా మారుతోంది.

అయితే, కోనసీమ రైతుల విషయంలో పవన్ ఒక సానుకూల నిర్ణయం తీసుకున్నారు. 40 ఏళ్ల సమస్యకు 45 రోజుల్లో శాశ్వత పరిష్కార ప్రణాళికను సిద్ధం చేసి సంక్రాంతి తర్వాత ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. అలాగే శంకరగుప్తం డ్రైన్ మరమ్మతులకు రూ.20.62 కోట్లు, కొబ్బరి బోర్డు ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదన లాంటి హామీలతో ప్రజల వద్దకు వెళ్తున్నారు.

రానున్న మూడేళ్లలో ప్రజా సమస్యలపై గళం విప్పి, కూటమి ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలబడితేనే రాజకీయాల్లో తన పవర్ స్టార్ డమ్‌ను నిలబెట్టుకోగలరని జనసైనికులు నమ్ముతున్నారు.

Leave a comment