రాజ్ తరుణ్ మార్కెట్ పతనం: 7 రోజుల్లోనే ఓటీటీకి ‘పాంచ్‌మినార్’ షాక్!

టాలీవుడ్‌ యంగ్ హీరో రాజ్‌ తరుణ్ పరిస్థితి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఉయ్యాల జంపాల’, ‘కుమారి 21ఎఫ్’ లాంటి హిట్స్‌తో మంచి ఫామ్‌లోకి వచ్చిన ఈ హీరో.. గత కొన్ని సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. వరుస ప్లాపులతో ఆయన మార్కెట్ పూర్తిగా పతనమైంది. ఆ పతనానికి తాజా నిదర్శనం.. ఆయన లేటెస్ట్ సినిమా ‘పాంచ్‌మినార్’.

రమేశ్ కడుములు దర్శకత్వం వహించిన ‘పాంచ్‌మినార్’ చిత్రం నవంబర్ 21, 2025 శుక్రవారం రోజున థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఒక సాధారణ సినిమాకు థియేటర్లలో మినిమం నాలుగు వారాల (28 రోజులు) విండో ఉంటుంది. కొందరు స్టార్ హీరోల సినిమాలు కూడా కనీసం మూడు వారాలు థియేటర్‌లో ఆగాల్సిందే. కానీ రాజ్‌ తరుణ్ సినిమా మాత్రం ఏకంగా రికార్డు సృష్టించింది. అవును, ఆ సినిమా విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.

నవంబర్ 28, 2025 శుక్రవారం నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. టాలీవుడ్ చరిత్రలోనే అతి తక్కువ వ్యవధిలో ఓటీటీలోకి వచ్చిన మెయిన్ స్ట్రీమ్ సినిమా ఇది అని చెప్పాలి.

విడుదలకు ముందే తేలిపోయిన సినిమా!

నిజానికి, రాజ్‌ తరుణ్ సినిమా విడుదల అవుతోందనే విషయం కూడా ప్రేక్షకులకు తెలియలేదు. సినిమాకు బజ్ లేకపోవడం, ప్రమోషన్స్ సరిగా జరగకపోవడం, గత చిత్రాల ప్రభావం.. ఇవన్నీ సినిమాను మొదటి రోజే థియేటర్‌కు రానివ్వకుండా చేశాయి. ‘పాంచ్‌మినార్’ కి వచ్చిన స్పందన చూసి డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు వెంటనే చేతులు ఎత్తేశారు.

థియేటర్ల రెంట్, మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టే బదులు, ఆల్రెడీ కుదిరిన ఓటీటీ డీల్‌ను వెంటనే అమలు చేయడమే ఉత్తమం అని భావించారు. దీనిని బట్టే ఆ సినిమాకు ఎలాంటి కలెక్షన్లు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. థియేట్రికల్ రన్‌ను కేవలం నామమాత్రంగా మాత్రమే నిర్వహించారు.

రాజ్‌ తరుణ్‌ కెరీర్‌కు మళ్ళీ పుంజుకుంటుందా?

ఒకప్పుడు ఈ యంగ్ హీరో సినిమాలు చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచేవి. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది. కానీ సరైన కథలను ఎంచుకోలేకపోవడం, ప్రయోగాలు వికటించడంతో రాజ్‌ తరుణ్‌ మార్కెట్ ఇప్పుడిలా పూర్తిగా కూలిపోయింది.

ఆయన నటించిన సినిమా వారం తిరగకుండానే ఓటీటీలోకి రావడం, జనాలు కనీసం పట్టించుకోకపోవడం ఆయన కెరీర్‌కు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా చెప్పవచ్చు. తదుపరి చిత్రాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటేనే రాజ్‌ తరుణ్ మళ్లీ పోటీలోకి రాగలరు.

Leave a comment