అమరావతి రాజధాని నిర్మాణ క్రమం వేగం పుంజుకున్న ఈ సమయంలో రైతులకు కొత్త సమస్య వచ్చిపడింది. ఇంతకాలం ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూసిన అన్నదాతలు, ఇప్పుడు తమకు కేటాయించిన ప్లాట్లలో ‘వాస్తు’ సరిగా లేదని అభ్యంతరం చెబుతున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతుల సమస్యలు వినడానికి నియమించిన త్రిసభ్య కమిటీ తాజాగా సమావేశమైంది. ఈ సమావేశంలోనే రైతులు తమ కష్టాలను, ముఖ్యంగా వాస్తు దోషాల గురించి ప్రస్తావించారు. కేవలం అభివృద్ధి పనులనే కాదు, తమ ప్లాట్ల వాస్తును కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు.
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని నిర్ధారించారు. అమరావతిలో కేటాయించిన 1286 ప్లాట్లలో ‘వీధి పోటు’ సమస్యలు ఉన్నాయని, దీనివల్ల సుమారు 156 మంది రైతులు వాస్తు పరంగా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తెలిపారు. వాస్తు శాస్త్రం ప్రకారం ‘వీధి పోటు’ ఉన్న ప్లాట్లు అశుభమని, వాటిని తీసుకోలేమని రైతులు తేల్చి చెప్పడంతో కమిటీ ముందు ఈ పెద్ద చిక్కు వచ్చి పడింది.
రైతుల నుంచి వచ్చిన ఈ వాస్తు ఫిర్యాదుపై ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించింది. వాస్తు దోషం ఉన్న ప్లాట్లకు బదులుగా, వేరే చోట ప్రత్యామ్నాయ ప్లాట్లు కావాలని కోరితే.. తప్పకుండా కేటాయిస్తామని మంత్రి పెమ్మసాని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ హామీతో 156 మంది రైతులకు పెద్ద ఊరట లభించినట్టే.
మంత్రి నారాయణ, ఇతర సభ్యులు కూడా మాట్లాడుతూ.. రైతులు తమ ప్లాట్ల విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులు తమ భవిష్యత్తును రాజధాని కోసం త్యాగం చేశారు కాబట్టి, వారి ప్రతి చిన్న సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ప్లాట్ల కేటాయింపుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు.
పెన్షన్లు, హెల్త్ కార్డులు… నెల రోజుల్లో క్లియర్!
వాస్తు సమస్యతో పాటు, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు, హెల్త్ కార్డుల సమస్యలను కూడా రైతులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఈ ప్రయోజనాలపై ప్రభుత్వం వెంటనే స్పందించింది.
నెల రోజుల్లోగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అంటే, రైతులకు రావాల్సిన ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నది ప్రభుత్వ హామీ..!
ఇక, మొదటి విడత ల్యాండ్ పూలింగ్‌లో ఇంకా మిగిలి ఉన్న కొన్ని ‘అసైన్డ్’ భూములు, ‘లంక’ భూముల సమస్యలపై కూడా కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ అసైన్డ్ భూములను మిగిలిన భూములతో వేరు చేసి, దీనిపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని మంత్రులు తెలిపారు. అంతేకాకుండా, గ్రామ కంఠాల్లోని ప్లాట్ల కేటాయింపులపై ఉన్న అనుమానాలను కూడా పూర్తిగా పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ సమస్యల పరిష్కారం ఒకవైపు జరుగుతుండగానే, రాజధాని విస్తరణ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇటీవల కేబినెట్… 16,666 ఎకరాల రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు (LPS 2.0) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే వ్యవస్థ, 2,500 ఎకరాల అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ లాంటి మెగా ప్రాజెక్టుల కోసం ఈ భూమిని సేకరిస్తున్నారు.

