ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం దశాబ్ద కాలంగా ఒక రాజకీయ, ఆర్థిక సుడిగుండంగా మారింది. అనేక ఆశలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, నేడు తీరని సవాళ్లను ఎదుర్కొంటోంది. నిర్మాణంలో జాప్యం, రైతులకు చేసిన హామీల అమలులో లోపాలు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు రాజధాని భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
రైతుల ఆవేదన: మళ్లీ భూ సమీకరణ!
అమరావతి కోసం గతంలో స్వచ్ఛందంగా భూమిని ఇచ్చిన రైతుల సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదు. అప్పట్లో ఇచ్చిన ప్లాట్లు, పెన్షన్లు, అభివృద్ధి పనుల విషయంలో అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఇప్పుడు రెండో దశ భూ సమీకరణ (LPS 2.0) పై దృష్టి సారించింది. రాజధాని విస్తరణ, ఎయిర్‌పోర్ట్ వంటి కీలక ప్రాజెక్టుల కోసం రైతుల నుండి అదనంగా భూమి సేకరించాలని చూస్తోంది.
అయితే, తొలి దశలోనే సమస్యలు పరిష్కారం కాకపోవడం, మధ్యలో ప్రభుత్వం మారడం వల్ల ఐదేళ్లు ప్రాజెక్టు నిలిచిపోవడం వంటి అనుభవాల వల్ల రైతులు అడగుడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. కొందరు రైతులు కొత్త పథకానికి మద్దతు ఇస్తున్నా, పాత సమస్యలు పరిష్కరించాకే కొత్త సమీకరణ చేపట్టాలనే డిమాండ్ బలంగా ఉంది.
గత అనుభవాల దృష్ట్యా, పాత రైతుల సమస్యలు, అగ్రిమెంట్లలోని లోపాలను సరిచేయకుండా కొత్త భూసేకరణకు వెళితే, అది కోర్టు వివాదాలకు, నిరసనలకు దారి తీసే ప్రమాదం ఉంది. కొందరు రైతులు ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టే ఆలోచనలో ఉన్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
ఆర్థిక ఇబ్బందులు: పెరిగిన వ్యయం, నిధుల లేమి..!
అమరావతి నిర్మాణంలో ప్రధాన అడ్డంకి ఆర్థిక ఇబ్బందులే. 2019లో ప్రాజెక్ట్ నిలిచిపోవడం వల్ల పెరిగిన నిర్మాణ వ్యయం (Cost Escalation) ఇప్పుడు ప్రభుత్వానికి పెనుభారంగా మారింది. ఐదేళ్ల జాప్యం కారణంగా భవన నిర్మాణ వ్యయాలు 35-55% పెరిగాయి. గతంలో సుమారు ₹64,910 కోట్లుగా అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయం, ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉన్నందున, ఏకకాలంలో అమరావతి నిర్మాణానికి భారీగా ఖర్చు పెట్టడం కత్తి మీద సాము లాంటిది. ఒకవైపు ఎన్నికల హామీల మేరకు సంక్షేమ పథకాల అమలుకు వేల కోట్లు కేటాయించాల్సి వస్తుండగా, మరోవైపు రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సమీకరించడం పెద్ద సవాలు.
సంక్షేమం ముఖ్యమా? రాజధాని ముఖ్యమా? అన్న వాదన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, కొత్త ప్రభుత్వం కేంద్రం నుంచి, వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమకూర్చే ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతికి వచ్చి ₹1,328 కోట్ల పెట్టుబడితో 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల కార్యాలయాలకు శంకుస్థాపన చేయడం వలన అమరావతి మీద నమ్మకాన్ని రేకెత్తించడానికి ఉపయోగపడతాయి తప్ప రాజధాని నిర్మాణానికి అలాంటి శంకుస్థాపనలు నిరుపయోగం.ఏది ఏమైనా, రాజధాని నిర్మాణానికి వేల కోట్లు తక్షణం అవసరం.
అడ్డంకులు: రాజకీయ అనిశ్చితి – న్యాయపరమైన చిక్కులు
అమరావతి నిర్మాణం ఆలస్యం కావడానికి అతిపెద్ద కారణం రాజకీయ అనిశ్చితి. 2019లో అధికార మార్పుతో మూడు రాజధానుల ప్రతిపాదన రావడం, దానిపై ఐదేళ్ల పాటు సాగిన న్యాయ పోరాటం ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసింది. పాత నిర్మాణాలను, రహదారులను అంచనా వేసి, దెబ్బతిన్న భాగాలను మరమ్మత్తు చేయడానికే ఇప్పుడు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
న్యాయపరమైన అడ్డంకులు కూడా నిర్మాణానికి సవాలు విసురుతున్నాయి. రైతులు దాఖలు చేసిన కేసులు, R-5 జోన్ కేటాయింపు వంటి అంశాలు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ న్యాయపరమైన చిక్కులను వేగంగా పరిష్కరించకుండా పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టడం కష్టమే. మొత్తంగా, అమరావతి ఒక రాజధానిగా ఎదగాలంటే, కేవలం ఇటుక, సిమెంటుతో పాటు రైతుల్లో విశ్వాసం, ప్రభుత్వంలో స్థిరత్వం, నిధుల లభ్యత… ఇవన్నీ సమపాళ్లలో ఉండాలి.

