ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసనమండలి ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి, అధికార కూటమిలో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాల వ్యవహారంపై నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు ఏడాది కాలంగా చైర్మన్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ రాజీనామాలు, హైకోర్టు జోక్యంతో ఒక్కసారిగా కదలిక తెచ్చాయి.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీత.. ఈ ఆరుగురూ గత సార్వత్రిక ఎన్నికల తరువాత పార్టీకి గుడ్‌బై చెప్పారు.
ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగానే, వీరు రాజీనామా లేఖలు ఇచ్చి అధికార పక్షంలో చేరారు. అయితే, వైఎస్సార్‌సీపీ మనిషి అయిన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు మాత్రం ఈ లేఖలను ఆమోదించకుండా ఇన్నాళ్లు జాప్యం చేశారు.
అసలు కథ ఇక్కడే మొదలైంది. ఎమ్మెల్సీలు రాజీనామా చేసి దాదాపు 11 నెలలు దాటినా చైర్మన్ వాటిని పక్కన పెట్టారు. దాంతో, ఈ జాప్యాన్ని ప్రశ్నిస్తూ.. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం… చైర్మన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, రాజీనామాపై నిర్ణయం తీసుకోకుండా ఏడాది పాటు పెండింగ్‌లో ఉంచడం ‘చట్టవిరుద్ధం, ఏకపక్షం’ (Illegal and Arbitrary) అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
న్యాయస్థానం ఆదేశాలు చూసి చైర్మన్ మోషేన్ రాజు ఖంగుతిన్నారు. వెంటనే రంగంలోకి దిగి, నాలుగు వారాల్లోగా ఈ వ్యవహారాన్ని తేల్చేయాలని కోర్టు ఆదేశించడంతో.. ఈ ఆరుగురు రెబల్ ఎమ్మెల్సీలను విచారణకు పిలిపించారు. ఈ విచారణ సందర్భంగా చైర్మన్‌కు, ఎమ్మెల్సీలకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
ప్రలోభాలకు లొంగలేదు.. జగన్ విధానాలే నచ్చలేదు!
మీరు ‘ప్రలోభాలకు’ లొంగి రాజీనామా చేశారా అని చైర్మన్ ప్రశ్నించగా… రెబల్ ఎమ్మెల్సీలు ఆ వాదనను బలంగా తిప్పికొట్టారు. “మా నిర్ణయం స్వచ్ఛందం. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పాలనలో లోపాల కారణంగానే పార్టీకి దూరమయ్యాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు” అని తేల్చి చెప్పారు.
ముఖ్యంగా, వైఎస్సార్‌సీపీలో కొనసాగే ఆలోచన తమకు లేదని, రాజీనామాపై పునరాలోచన చేయబోమని వారు ధీమాగా ప్రకటించారు. “ఇంకా కొద్ది కాలమే పదవీ కాలం ఉంది, ఎందుకు రాజీనామా ఉపసంహరణ ఆలోచన లేదా?” అంటూ చైర్మన్ ఎంత నచ్చజెప్పాలని చూసినా వారు ససేమిరా అన్నారు.
చైర్మన్ మోషేన్ రాజు వైఎస్సార్‌సీపీ నామినీ. అందుకే ఆయన రాజీనామాలను ఆమోదించకుండా, వీలైనంత ఎక్కువ కాలం ఆ స్థానాలను నిలుపుకోవాలని ప్రయత్నించారు. దీని వెనుక మండలిలో వైఎస్సార్‌సీపీ బలాన్ని కాపాడుకోవాలనే రాజకీయ వ్యూహం ఉంది.
జయమంగళ వెంకటరమణ జనసేనలోకి, జాకియా ఖానం, పోతుల సునీత బీజేపీలోకి, మరికొందరు టీడీపీలోకి వెళ్లిన విషయం బహిరంగ రహస్యం. అందుకే వారు తమ రాజీనామాలపై రాజ్యాంగబద్ధమైన నిర్ణయాన్ని తక్షణమే తీసుకోవాలని కోరారు.
న్యాయస్థానం డెడ్‌లైన్ ఉండడంతో… చైర్మన్‌కు వేరే దారి లేక ఈ విచారణను ముగించారు. త్వరలో ఈ రాజీనామాల ఆమోదంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ఆమోదిస్తే, ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి. ఏది ఏమైనా, రాజ్యాంగ బద్ధతను నిలబెట్టేందుకు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు శాసన మండలిలో కీలక రాజకీయ మార్పుకు దారి తీయబోతున్నాయనడంలో సందేహం లేదు.

