బుల్లితెర సూపర్ స్టార్, వెండితెర కథానాయకుడు సుడిగాలి సుధీర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘GOAT’. మామూలుగా సుధీర్ సినిమా అంటే ఉండే సందడి వేరు, కానీ ఈ సినిమా ఇప్పుడు వివాదాలతో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా నిర్మాత మొగుళ్ళ చంద్రశేఖర్ మీడియా ముందుకొచ్చి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సుధీర్ అంటే తనకు ఎంతో గౌరవమని, అతను ఎంతో కష్టపడి పైకి వచ్చాడని, అందుకే “వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్” అని నమ్మి ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టానని చెప్పారు.
ఇది సుధీర్ కెరీర్ లోనే “బెస్ట్ మూవీ” అవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. కానీ, సినిమా ప్రమోషన్స్ విషయంలో సుధీర్ దూరంగా ఉండటం తనను బాధిస్తోందని ఆవేదన చెందారు.
అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే.. ఈ సినిమా దర్శకుడు నరేష్ కుప్పిలికి, నిర్మాతలకు మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. దర్శకుడు ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఆన్లైన్లో లీక్ చేశారని , హీరోయిన్ దివ్య భారతిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేశారని నిర్మాత ఆరోపించారు. దీనిపై ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ ద్వారా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు చంద్రశేఖర్ వెల్లడించారు.
దర్శకుడు చేసిన పనులకు హీరో సుధీర్ సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని, అందుకే ఆయన ప్రమోషన్స్ కి రావడం లేదని నిర్మాత అనుమానం వ్యక్తం చేశారు. “ప్లీజ్ రండి.. సినిమాని బతికించండి” అని సుధీర్ ను మీడియా సాక్షిగా వేడుకున్నారు.
సుధీర్ కు డైరెక్టర్ తో ఉన్న సాన్నిహిత్యం వల్లనే ఆయన మౌనంగా ఉన్నారని, త్వరలోనే నిజం తెలుసుకుంటారని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈ వివాదంపై సుధీర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

