నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు గ్యారెంటీ. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అయితే, ఈసారి బాలయ్య గర్జన కేవలం థియేటర్లలో రికార్డుల కోసమే కాదు, నిర్మాతల జేబులు నిండాలంటే కూడా గట్టిగానే ఉండాలి. ఎందుకంటే, దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) టాలీవుడ్‌లో సరికొత్త బిజినెస్ మోడల్‌కు తెరలేపింది.
ఇప్పటివరకు సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఓటీటీ డీల్స్ నిర్మాతలకి ఒక ‘సేఫ్ జోన్’లా ఉండేవి. సినిమా ఫ్లాప్ అయినా, డిజిటల్ రైట్స్ ద్వారా పెట్టిన పెట్టుబడిలో సగం వెనక్కి వచ్చేది. కానీ, అఖండ 2 సినిమాతో నెట్‌ఫ్లిక్స్ ఈ పద్ధతిని మార్చేసింది.
-
బంపర్ ఆఫర్: సినిమా థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అయితే, ఒప్పందం చేసుకున్న మొత్తం మీద 25% బోనస్ ఇస్తారు.
-
డేంజర్ బెల్: ఒకవేళ సినిమా తేడా కొడితే మాత్రం, ముందు అనుకున్న మొత్తంలో 25% కోత విధిస్తారు.
అంటే, ఇకపై ఓటీటీ రేటు కూడా థియేటర్ దమ్ము మీద ఆధారపడి ఉంటుందన్నమాట. “ఫ్లాప్ సినిమాను మేమెందుకు కోట్లు పోసి కొనాలి?” అనే లాజిక్ నెట్‌ఫ్లిక్స్ బయటకు తీసింది.
నిర్మాతల్లో టెన్షన్ ఎందుకు?
సాధారణంగా బాలయ్య సినిమాలకు మాస్ సెంటర్స్ లో బీభత్సమైన ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ, టికెట్ రేట్లు పెరగడం, కుటుంబంతో సినిమాకు వెళ్లాలంటే వేలల్లో ఖర్చవ్వడం వంటి కారణాల వల్ల సామాన్యుడు థియేటర్ కు దూరమవుతున్నాడు. దానికి తోడు, నెల రోజుల్లోపే ఓటీటీలో సినిమా వచ్చేస్తుందనే ధీమా కూడా ప్రేక్షకుల్లో పెరిగిపోయింది.
ఇలాంటి టైమ్ లో, నెట్‌ఫ్లిక్స్ పెట్టిన ఈ ‘లింక్డ్ డీల్’ చిన్న, పెద్ద నిర్మాతలను కలవరపెడుతోంది. అఖండ 2 కనుక బాక్సాఫీస్ దగ్గర ఈ కొత్త పరీక్ష పాస్ అయితే, భవిష్యత్తులో మిగతా సినిమాలకు కూడా ఇవే రూల్స్ వర్తించే ఛాన్స్ ఉంది.
మొత్తానికి, వెండితెరపై బాలయ్య విలన్లను ఊచకోత కోస్తాడు సరే, కానీ బిజినెస్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ పెట్టే కోతను తప్పించుకోవాలంటే మాత్రం ‘అఖండ 2’ గట్టిగా సౌండ్ చేయాల్సిందే. డిసెంబర్ 5న రిజల్ట్ తేలిపోనుంది!

