గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఊహించని వివాదానికి దారితీసింది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే రవీంద్రభారతి ప్రాంగణంలో బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే డిసెంబర్ 15న ఎస్పీ బాలు జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ పనులను పరిశీలించేందుకు వచ్చిన నిర్వాహకులను తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ నేతృత్వంలోని బృందం అడ్డుకుంది.
ఏపీ వారి విగ్రహాలు ఇక్కడెందుకు?
“రవీంద్రభారతి తెలంగాణ కళలకు కాణాచి. ఇక్కడ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి విగ్రహాలు ఎలా ఏర్పాటు చేస్తారు?” అని పృథ్వీరాజ్ ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ , కవి అందెశ్రీ లాంటి దిగ్గజాలకు దక్కని గౌరవం, పక్క రాష్ట్రం వారికి ఎందుకని ఆయన నిలదీశారు. తెలంగాణ గడ్డపై ముందుగా స్థానిక కళాకారుల విగ్రహాలే ఉండాలని, ఆ తర్వాతే ఇతరులని ఆయన డిమాండ్ చేశారు.
శుభలేఖ సుధాకర్‌తో వాగ్వాదం..
విగ్రహావిష్కరణ పనులను పర్యవేక్షించేందుకు అక్కడకు వచ్చిన సీనియర్ నటుడు, బాలు బంధువు శుభలేఖ సుధాకర్ కు , పృథ్వీరాజ్‌కు మధ్య ఈ క్రమంలోనే ఆసక్తికర వాగ్వాదం చోటుచేసుకుంది. “బాలు గారు కేవలం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదు. ఆయన కళా ప్రపంచానికి చెందిన వారు. కళకు, సంగీతానికి ఎల్లలు ఉండవు,” అని సుధాకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కానీ, పృథ్వీరాజ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. “అవన్నీ మాకు అనవసరం. ముందు మా తెలంగాణ బిడ్డల విగ్రహాలు పెట్టాకే, వేరే వారి గురించి ఆలోచించండి. లేదంటే అడ్డుకుంటాం,” అంటూ భీష్మించుకు కూర్చున్నారు.
బాలు అంటే తెలుగు వారందరికీ ఎంతో అభిమానం ఉన్నప్పటికీ, విగ్రహం ‘ప్లేస్’ విషయంలోనే ఈ రచ్చ జరుగుతోంది. రవీంద్రభారతి వంటి ప్రభుత్వ సాంస్కృతిక కేంద్రాల్లో ప్రాంతీయ సమతుల్యత పాటించాలన్నది ఉద్యమకారుల వాదన.
ప్రభుత్వం గానీ, భాషా సాంస్కృతిక శాఖ గానీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. డిసెంబర్ 15న తలపెట్టిన ఆవిష్కరణ కార్యక్రమం సాఫీగా జరుగుతుందా లేక ఈ వివాదం మరింత ముదురుతుందా అనేది ఉత్కంఠగా మారింది.

