దర్శకుడు గుణశేఖర్ అంటే భారీ సెట్స్, చారిత్రక నేపథ్యం గుర్తుకొస్తాయి. ‘రుద్రమదేవి’, ‘శాకుంతలం’ లాంటి చిత్రాలు తీసిన ఆయన, ఇప్పుడు పూర్తిగా ట్రాక్ మార్చేశారు. ఈసారి ట్రెండీ సోషల్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. అదే ‘యుఫోరియా’ (Euphoria).
తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది.టీజర్ చూస్తుంటే, గుణశేఖర్ ఈసారి యువతరం సమస్యలపై గురిపెట్టినట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా, యువత డ్రగ్స్ వాడకం వల్ల పక్కదారి పడుతున్న విధానాన్ని చాలా బలంగా చూపించారు.
మత్తులో తూగుతున్న యువతిని మెట్రోలో చూపించడం, లైంగిక వేధింపుల దృశ్యాలు, రేప్ కల్చర్‌కు వ్యతిరేకంగా నిరసనలు… ఇవన్నీ సినిమా థీమ్ ఎంత సీరియస్‌గా ఉంటుందో చెప్పకనే చెబుతున్నాయి.ఈ కథ కేవలం డ్రగ్స్‌కే పరిమితం కాదు. సమాజంలో నేరాలకు పాల్పడే 18 ఏళ్ల లోపు పిల్లలను ఉద్దేశించి ఉపయోగించే ‘చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా’ (CCL) అనే అంశాన్ని టీజర్లో ప్రముఖంగా వినియోగించారు.
అంటే, యువ నేరస్తుల మానసిక పరిస్థితి, వారిని మార్చడానికి వ్యవస్థ ఎలా ప్రయత్నిస్తుంది అనే కోణంలో గుణశేఖర్ కథను నడిపిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసై నేరాలు చేసే పిల్లలను కూడా బాల్య న్యాయ చట్టం (Juvenile Justice Act, 2015) పరిధిలోనే చూస్తారు. ఈ చట్టం పిల్లలకు మత్తు పదార్థాలు ఇచ్చేవారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ అంశాలన్నీ సినిమాలో కీలకమని తెలుస్తోంది. ఇది చాలా సామాజిక బాధ్యతతో కూడిన ప్రయత్నం అనడంలో సందేహం లేదు.
ఈ సినిమాలో స్టార్ కాస్ట్ పెద్దగా లేకపోయినా, కీలక పాత్రల్లో అగ్ర నటీనటులు ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన భూమికా చావ్లా, బాల నటి సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. భూమిక, గుణశేఖర్ కాంబినేషన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వస్తుండటం విశేషం.
అంతేకాదు, టీజర్లో కనిపిస్తున్న విగ్నేష్ గావిరెడ్డి అనే కొత్త నటుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇతను భూమిక కొడుకు పాత్రలో కనిపించే అవకాశం ఉంది. నటుడు, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ (GVM), నాజర్ లాంటి సీనియర్ నటులు కూడా భాగమయ్యారు.సాంకేతిక నిపుణుల్లో చాలా మంది కొత్తవారు ఉన్నా, గుణశేఖర్ తనదైన అనుభవంతో వారిని అద్భుతంగా వాడుకున్నట్టు తెలుస్తోంది.
విజువల్స్, కెమెరా పనితనం చాలా కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా, ‘యుఫోరియా’కు ఎంఎం కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. గతంలో ‘మ్యాడ్’తో హిట్ కొట్టిన ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఈ సోషల్ డ్రామాకు ఎలాంటి ట్యూన్స్ ఇచ్చాడో చూడాలి. నీలిమ గుణ ఈ చిత్రాన్ని గుణ టీంవర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
దర్శకుడు గుణశేఖర్ చివరి సినిమా ‘శాకుంతలం’ కొంత నిరాశపరిచినప్పటికీ, ఈసారి కొత్త పంథాలో యువతకు మెసేజ్ ఇచ్చే కమర్షియల్ చిత్రాన్ని తీయడానికి ప్రయత్నించడం అభినందనీయం. స్టార్ హీరోల ఇమేజ్ కంటే, కథ, కంటెంట్ బలంగా ఉంటేనే సినిమా నిలబడుతుందని ఆయన నమ్మినట్టున్నారు. కథలోని గాఢత, సామాజిక సందేశం ప్రేక్షకులను కచ్చితంగా ఆలోచింపజేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇది 2026 ఫిబ్రవరి 6 న విడుదలవుతుంది అని అధికారికంగా ప్రకటించారు.!


1 Comment
Chandra
adiripoyindi teaser