2024 లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నుంచే నారా చంద్రబాబు నాయుడు, రాజధాని అమరావతిని ‘ప్రపంచ స్థాయి’ నగరంగా నిర్మించేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే, ఈ హడావుడిలో మరో కీలక నిర్ణయం ఇప్పుడు పెద్ద వివాదానికి కేంద్రమైంది.
తొలి విడత భూ సమీకరణ (LPS) కింద భూమి ఇచ్చిన దాదాపు 29 వేల మంది రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం, అభివృద్ధి ఫలాలు అందకముందే, ప్రభుత్వం ఇప్పుడు అమరావతి ఫేజ్-2కు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల పేరుతో దాదాపు 20 వేల ఎకరాల వరకు సమీకరించాలని కేబినెట్ ఆమోదం తెలిపిందనే వార్త సంచలనం సృష్టిస్తోంది.
2014-19 మధ్య చంద్రబాబు హయాంలో అమరావతి కోసం 34,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. పదేళ్లలో భూమికి బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు, వార్షిక కౌలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
కానీ, అప్పటి ప్రభుత్వం రాజధాని నిర్మాణంపైనే దృష్టి పెట్టడం, ప్లాట్ల డెవలప్‌మెంట్, కేటాయింపు ప్రక్రియలో జాప్యం చేయడం వల్ల తొలి విడత రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వారికి రిటర్నబుల్ ప్లాట్లు పంపిణీ చేయడంలో జరిగిన ఆలస్యం, అభివృద్ధి పనులు నిలిచిపోవడం 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఒక ప్రధాన కారణంగా నిలిచిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఇప్పుడు, మళ్లీ ఆ సమస్యలను పూర్తిగా పరిష్కరించకుండానే, కొత్తగా భూమిని సేకరించాలని చూడటం చంద్రబాబు చేస్తున్న పెద్ద తప్పు.ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
తొలి విడత 54,000 ఎకరాల (ప్రభుత్వ, రైతు భూమి కలిపి)పై శ్వేతపత్రం విడుదల చేయకుండా, రైతుల సమస్యలు పరిష్కరించకుండా కొత్త సేకరణకు వెళ్లడం “రియల్ ఎస్టేట్ మాఫియా” కోసమే అని వై.ఎస్. షర్మిల వంటి నేతలు సూటిగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఉన్న భూమిని సక్రమంగా వినియోగించకుండా, అంతర్జాతీయ ప్రాజెక్టుల పేరుతో వేల ఎకరాలు సేకరించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రశ్నిస్తున్నారు.
భవిష్యత్తులో టీడీపీకి నష్టం.?
అమరావతిని ‘గ్రోత్ ఇంజిన్’గా మార్చాలనే చంద్రబాబు లక్ష్యం మంచిదే అయినప్పటికీ, రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో జరిగే ఏ చిన్న పొరపాటు అయినా టీడీపీకి భవిష్యత్తులో పెను రాజకీయ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.
తొలి విడత రైతుల సమస్యలను పెండింగ్‌లో ఉంచి, కొత్తగా భూమి అడగడం ద్వారా, ప్రభుత్వంపై రైతుల్లో ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. ఇది కేవలం అమరావతికే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రభావం చూపుతుంది.
ఆర్థిక భారం, ప్రాధాన్యత:
ఆర్థిక వనరులు సరిగా లేని సమయంలో, ఇప్పటికే నిలిచిపోయిన ప్రాజెక్టుల పూర్తికి కాకుండా, కొత్త భూ సేకరణకు ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
రియల్ ఎస్టేట్ ముద్ర:
అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో వేల ఎకరాలు సేకరించడం, అది కూడా తొలి సమస్యలు పరిష్కారం కాకముందే జరగడం వల్ల, ఇది కేవలం భూముల ధరలు పెంచే రియల్ ఎస్టేట్ ఎత్తుగడ అనే విమర్శలకు బలం చేకూరుతుంది.
ప్రభుత్వం వెంటనే తొలి విడత రైతులకు ప్లాట్ల కేటాయింపు, అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఆ తర్వాతే రెండో విడతపై స్పష్టత ఇవ్వాలి. లేదంటే, 2019లో ఎదురైన అనుభవం కంటే దారుణమైన పరిస్థితి భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదం ఉంది. రైతుల సహకారం సంతృప్తితో ఉంటేనే, అమరావతి కల సాకారం అవుతుంది.

