ప్రభాస్ సినిమాల నుంచి అందుకే నిష్క్రమణ-దీపికా పదుకొనే

దీపికా పదుకొనే నిర్ణయంతో టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. “ఆశకు అంతుండదు” అంటారు. కానీ, దీపికా పదుకొనే మాత్రం తనకు కీర్తి, డబ్బుపై ఎలాంటి ఆశ లేదని, కేవలం అర్థవంతమైన సినిమాలు, ఆరోగ్యవంతమైన పని వాతావరణం కోసమే ప్రయత్నిస్తున్నానని తేల్చి చెప్పింది. కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్, రూ. 500-600 కోట్ల పెద్ద ప్రాజెక్ట్‌లు తనను ఇప్పుడు ఉత్సాహపరచడం లేదన్నారు.

దీపికా ఈ భారీ ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం.. వర్క్ షెడ్యూల్ విషయంలో ఆమె పెట్టిన కఠినమైన షరతులే అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌తో చేయాల్సిన ‘స్పిరిట్’, మరోవైపు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్.. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టుల విషయంలోనూ దీపికా కచ్చితమైన డిమాండ్లు పెట్టారు. రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తానని, వీకెండ్స్‌లో అసలు షూటింగ్‌కు రాలేనని ఆమె స్పష్టం చేశారట.

దీపికా తల్లి అయిన తర్వాత (2024 సెప్టెంబర్) ఈ ప్రయారిటీ మార్పు వచ్చింది. కొత్తగా బిడ్డలను కన్న తల్లులకు పని చేసే చోట సరైన సపోర్ట్ ఉండాలని ఆమె బలంగా వాదించారు. “అలిసిపోయిన వ్యక్తిని మళ్ళీ పనిలోకి తీసుకురావడం ఎవరికీ మంచిది కాదు,” అని ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే, నిర్మాతలు మాత్రం దీపికా డిమాండ్లను ‘అన్యాయం’గా భావించారట. తొలుత, ‘స్పిరిట్’ నిర్మాతలు ఆమె షరతులకు ఒప్పుకోకపోవడంతో, ఆమెను తొలగించి, ఆమె స్థానంలో ఇప్పుడు త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. బాలీవుడ్‌లో చాలా మంది అగ్ర హీరోలు ఎప్పటి నుంచో 8 గంటల షిఫ్టులోనే పనిచేస్తున్నా అది వివాదం కాదని, మహిళలు ఇదే డిమాండ్ చేస్తే మాత్రం హైలైట్ అవుతుందని దీపికా ఫైర్ అయ్యారు.

ఇక ‘కల్కి 2898 AD’ సీక్వెల్ విషయానికి వస్తే, నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా ఆమెతో “సరైన భాగస్వామ్యం కుదరలేదు” అంటూ అధికారికంగా ప్రకటించింది. కేవలం 8 గంటల పని షెడ్యూలే కాకుండా..రెమ్యూనరేషన్‌లో రెవెన్యూ షేర్ (లాభాల్లో వాటా), అలాగే తన 25 మంది సిబ్బందికి ఫైవ్ స్టార్ హోటల్ వసతి, భోజన ఖర్చులను కూడా నిర్మాతలు భరించాలని ఆమె డిమాండ్ చేశారట. వీఎఫ్ఎక్స్ (VFX) ఆధారిత భారీ చిత్రాలకు ఇలాంటి కఠిన షెడ్యూల్స్ సాధ్యం కాదని భావించి, కల్కి టీం కూడా ఆమెతో పయనాన్ని ముగించుకుంది. ప్రస్తుతం దీపికా.. షారుఖ్ ఖాన్‌తో ‘కింగ్’, అల్లు అర్జున్‌తో అట్లీ చిత్రాల్లో నటిస్తున్నారు.

Leave a comment