టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలో ఊహించని మెరుపులా మరో కొత్త అధ్యాయం మొదలైంది. గత కొన్నాళ్లుగా ప్రేమ, డేటింగ్ వార్తల్లో ఉన్న సామ్, ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు.
ఈ పెళ్లి అత్యంత రహస్యంగా, అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ముఖ్యంగా, ఈ వివాహ క్రతువు సాధారణంగా కాకుండా, పవిత్రమైన ‘భూతశుద్ధి వివాహం’ పేరుతో జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
సోమవారం ఉదయం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈశా యోగ కేంద్రంలోని పవిత్ర లింగ భైరవి దేవి సన్నిధిలో ఈ వివాహం జరిగింది. దీనిని స్వయంగా ఈశా ఫౌండేషనే అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కేవలం 30 మంది అతిథుల సమక్షంలో ఈ ప్రైవేట్ వేడుకను పూర్తి చేశారని సమాచారం.
ఏంటీ ‘భూతశుద్ధి వివాహం’ రహస్యం.?
సాధారణ హిందూ వివాహాలకు భిన్నంగా ఈశా ఫౌండేషన్ ఆచరించే యోగ సంప్రదాయమే ఈ ‘భూతశుద్ధి వివాహం’. ఆలోచనలు, భావోద్వేగాలకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి ఈ క్రతువును రూపొందించారట.
వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేసి, వారి దాంపత్య జీవితంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా లింగ భైరవి దేవి అనుగ్రహాన్ని కోరడం దీని ముఖ్య ఉద్దేశం. సమంత, రాజ్ నిడిమోరు వంటి సెలబ్రిటీలు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ వివాహం జరగబోతోందని ఆదివారం రాత్రి నుంచే పుకార్లు మొదలయ్యాయి. అయితే, సోమవారం ఉదయం ఈశా ఫౌండేషన్ అధికారిక ప్రకటన ఇవ్వడంతో ఇండస్ట్రీ అంతా షాక్‌కు గురైంది. పెళ్లి తర్వాత సమంత స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను పంచుకుంటూ ‘01.12.2025’ అనే చిన్న క్యాప్షన్‌తో ఈ శుభవార్తను ధృవీకరించారు.
ఫొటోల్లో సమంత సంప్రదాయ ఎరుపు రంగు పట్టు చీర, భారీ బంగారు ఆభరణాలతో అచ్చం దేవతలా కనిపించారు. రాజ్ నిడిమోరు సైతం తెల్లటి కుర్తా-పైజామా, క్రీమ్ కలర్ షేర్వాణీలో పద్ధతిగా కనిపించారు.
ఏదేమైనా, ఎన్నో కష్టాలు, విమర్శలు ఎదుర్కొన్న సమంతకు కొత్త జీవితం లభించడం పట్ల ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈశా ఫౌండేషన్ కూడా ఈ నవ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. దేవి అనుగ్రహంతో వారి దాంపత్య జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించింది.

