దేశంలో అక్రమ ఆన్‌లైన్ లోన్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. బలవంతపు వసూళ్లు, దారుణమైన వేధింపులకు పాల్పడుతున్న 87 లోన్ యాప్‌లను దేశవ్యాప్తంగా నిషేధిస్తున్నట్లు (బ్యాన్) ప్రకటించింది. వినియోగదారులను దోపిడీ నుంచి కాపాడటానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంట్‌కు తెలియజేసింది.
ఈ సంచలన నిర్ణయాన్ని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్‌సభలో వెల్లడించారు. ఈ 87 యాప్‌లను నిషేధించే ఆదేశాలను ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. సమాచార సాంకేతిక చట్టం, 2000లోని సెక్షన్ 69ఏ కింద ఈ యాప్స్‌ను బ్లాక్ చేశారు. అంటే, దేశ పౌరులకు ఈ యాప్స్‌కు ఉన్న పబ్లిక్ యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేశారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎంతో మంది సులువుగా డబ్బుల కోసం ఈ యాప్స్‌ను ఆశ్రయించారు. ఎటువంటి డాక్యుమెంట్లు అడగకుండా, నిమిషాల్లో డబ్బు అకౌంట్‌లో వేయడంతో వీటి వాడకం అమాంతం పెరిగింది. అయితే, ఇక్కడే అసలు ముప్పు మొదలైంది.
ఈ అక్రమ యాప్‌ల వెనుక ఉన్న కంపెనీలు అధిక వడ్డీలు, దాచిన సర్వీస్ ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకున్నాయి. రుణం చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే చాలు.. రికవరీ ఏజెంట్ల పేరుతో అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు.
కొందరి వ్యక్తిగత డేటాను దొంగిలించి, మార్ఫింగ్ చేసిన చిత్రాలతో స్నేహితులు, బంధువులకు పంపి బ్లాక్‌మెయిల్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ వేధింపులను తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఈ దారుణమైన పరిస్థితిని గమనించే ప్రభుత్వం ఈ కఠిన చర్య తీసుకుంది.
యాప్‌లను కేవలం సాంకేతికంగా బ్లాక్ చేయడమే కాకుండా, వాటి మూలాలను కూడా పెకిలించే పనిలో ప్రభుత్వం ఉంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంపెనీల చట్టం, 2013 కింద ఈ ఆన్‌లైన్ లెండింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్న కంపెనీలపై విచారణలు, తనిఖీలు నిర్వహిస్తోంది.
చట్టాన్ని ఉల్లంఘించినట్లు రుజువైతే, వాటిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అక్రమ దందాకు పాల్పడిన సంస్థలకు ఇది గట్టి హెచ్చరికగా భావించవచ్చు.
సామాన్య ప్రజలు లోన్ తీసుకునే ముందు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెగ్యులేటెడ్ ఎంటిటీస్ (REs) లేదా RBI ఆమోదించిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCs) భాగస్వామ్యంతో ఉన్న చట్టబద్ధత ఉన్న యాప్‌లను మాత్రమే ఉపయోగించాలి.
ఇన్‌స్టంట్ లోన్ మోజులో పడి, అధిక వడ్డీలకు, సైబర్ నేరాలకు బలవ్వకుండా ఉండాలంటే, ఆ యాప్‌లకు సంబంధించిన ‘కీ ఫాక్ట్ స్టేట్‌మెంట్’ (KFS)ను, RBI రిజిస్ట్రేషన్‌ను తప్పక పరిశీలించాలి. కేంద్రం తీసుకున్న ఈ చర్య, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల భద్రతను పెంచడానికి ఒక కీలకమైన ముందడుగు.

