నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘అఖండ 2’ చిత్రం విడుదలపై ఊహించని అడ్డంకి పడింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ 4 సాయంత్రం వేయాల్సిన ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి.
ఈ అనౌన్స్‌మెంట్‌తో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు, అయోమయానికి గురయ్యారు.చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తరపున ఈ రద్దుకు కారణంగా ‘టెక్నికల్ ఇష్యూస్’ అని ప్రకటించారు. అయితే, సినిమాకు సంబంధించిన అంతా సిద్ధంగా ఉన్న సమయంలో, భారీ అంచనాల మధ్య ‘టెక్నికల్ ఇష్యూ’ అనే మాట వినిపించడంపై సినీ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలే ఇప్పుడు నిజమయ్యాయి.
నిజానికి, ఇది ‘టెక్నికల్’ సమస్య కాదు, ‘ఫైనాన్షియల్’ సమస్య అని తేలింది. ఈ ఇష్యూ వెనుక బలమైన న్యాయపరమైన వివాదం ఉంది. విశ్వసనీయ సమాచారం మరియు వెబ్ నివేదికల ప్రకారం, బాలకృష్ణ సినిమా విడుదలకు అడ్డంగా నిలిచింది మద్రాస్ హైకోర్ట్.
బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్’ (Eros International) కు చిత్ర నిర్మాతలు (14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుబంధ సంస్థ) దాదాపు ₹28 కోట్ల ఆర్బిట్రల్ రుణాన్ని చెల్లించాల్సి ఉంది. ఈ భారీ అప్పును సెటిల్ చేయకుండా సినిమాను రిలీజ్ చేస్తే, తమకు రావాల్సిన బకాయిలు ఆగిపోతాయని ఎరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది.
ఎరోస్ వాదనను పరిశీలించిన న్యాయస్థానం.. ఆ మొత్తాన్ని (సుమారు ₹27.80 కోట్లు, ప్లస్ 14% వడ్డీ) చెల్లించేంతవరకు ‘అఖండ 2’ సినిమా యొక్క థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ సహా అన్ని రకాల వాణిజ్య హక్కుల వినియోగంపై స్టే విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ కారణంగానే డిసెంబర్ 4న జరగాల్సిన ప్రీమియర్ షోలు నిలిచిపోయాయి.
మరోవైపు, ఈ ప్రీమియర్‌ల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి ప్రత్యేక అనుమతులు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ₹600 చొప్పున టికెట్ ధరను అనుమతించాయి. భారీ హైప్‌తో బుకింగ్స్ జోష్ మొదలవుతున్న సమయంలో, కోర్టు స్టే కారణంగా అంతా ఒక్కసారిగా ఆగిపోయింది.నిర్మాతలు చెప్పిన ‘టెక్నికల్ ఇష్యూ’ అంటే, ఈ లీగల్ అడ్డంకునే అని ప్రేక్షకులు మరియు ట్రేడ్ అనలిస్టులు అర్థం చేసుకున్నారు. ఈ స్టే అనేది తాత్కాలికమే.
నిర్మాతలు వెంటనే బకాయిలు చెల్లిస్తే, సినిమాపై ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. లేకపోతే, రేపు (డిసెంబర్ 5) జరగాల్సిన మెయిన్ రిలీజ్ కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది.సమయం చాలా తక్కువగా ఉంది. నిర్మాతలు యుద్ధప్రాతిపదికన ఈ లీగల్ సమస్యను పరిష్కరించి, అభిమానుల నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పెడతారని ఆశిద్దాం. లేకపోతే, ఈ సినిమా ‘టెక్నికల్’ సమస్యలతో కాదు, పూర్తిగా ‘ఫైనాన్షియల్ ఇష్యూ’తోనే చరిత్రలో నిలిచిపోతుంది.

