తెలంగాణ రైజింగ్ 2047 మెగా విజన్: 70 ఎకరాల్లో WTC, స్టార్స్ పెట్టుబడులు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరికొత్త శిఖరాలకు చేర్చడానికి భారీ స్కెచ్ వేశారు. రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌ను న్యూయార్క్, దుబాయ్, సింగపూర్‌తో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మహాయజ్ఞానికి వేదికగా “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047” ను ఎంచుకున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే ఈ సదస్సుపై ఇప్పుడు ప్రపంచ దృష్టి పడింది.

వరల్డ్ ట్రేడ్ సెంటర్: 70 ఎకరాల ల్యాండ్‌మార్క్!

ఈ సమ్మిట్‌లో ప్రభుత్వం ఆవిష్కరించబోయే అతిపెద్ద ప్రాజెక్ట్లలో ఒకటి ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీలో ఏకంగా 70 ఎకరాల విస్తీర్ణంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ (WTC) నిర్మించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. డబ్ల్యూటీసీ అంటే అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు, విదేశీ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారడం ఖాయం. రేవంత్ రెడ్డి కలలు కంటున్న $3 ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యానికి ఈ WTC ఒక పవర్‌హౌస్‌గా పనిచేస్తుందనడంలో సందేహం లేదు.

నిజానికి, ఈ గ్లోబల్ సమ్మిట్ జరిగే వేదికనే భవిష్యత్తులో ఈ 70 ఎకరాల WTC ప్రాజెక్ట్‌కు భూమి పూజ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు 120 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 3,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మెయిన్ హాల్‌లో 3,000 మంది అతిథులు కూర్చోవచ్చు.

స్టార్స్‌ను దించిన రేవంత్.. సినిమా స్టూడియోల హడావుడి!

పెట్టుబడులంటే కేవలం పారిశ్రామిక రంగానికే పరిమితం కాలేదనేది ఈ సమ్మిట్ చూస్తే అర్థమవుతోంది. తెలంగాణలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోలు, ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయడానికి బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ ఆసక్తి చూపడం హాట్ టాపిక్. ఇప్పటికే సల్మాన్ ఖాన్ స్వయంగా ముఖ్యమంత్రితో సమావేశమై, తన ప్లాన్‌ను వివరించారట. అజయ్ దేవ్‌గన్ కూడా అత్యాధునిక ఫిల్మ్ సిటీని నిర్మించాలని భావిస్తున్నారు. అంటే, త్వరలోనే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి టాలీవుడ్, బాలీవుడ్ కలయికతో కొత్త ఊపు రాబోతోంది.

గ్లోబల్ దిగ్గజాలు, 2047 విజన్!

ఈ సమ్మిట్‌కు గౌతమ్ అదానీ, అనంత్ అంబానీ, ఆనంద్ మహీంద్రా వంటి పారిశ్రామిక దిగ్గజాలతో పాటు 1,000 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు, 500 కంపెనీల CEOs రానున్నారు. వీరందరి ముందు “తెలంగాణ రైజింగ్ విజన్ 2047” డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరిస్తుంది. ఈ డాక్యుమెంట్ ద్వారా 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే కాదు, ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ని దేశంలోనే మొట్టమొదటి ‘నెట్ జీరో కార్బన్ సిటీ’గా తీర్చిదిద్దుతామని లక్ష్యం పెట్టారు.

సమ్మిట్ ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతుండగా, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి 90 నిమిషాలపాటు సంగీత కచేరీ ఇవ్వనున్నారు. రాజకీయాలకతీతంగా, పెట్టుబడులే లక్ష్యంగా, సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కూడా ఆహ్వానాలు పంపడం, సదస్సుకు కేంద్ర మంత్రుల మద్దతు కూడగట్టడం రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఈ సదస్సుతో తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుందనడంలో సందేహం లేదు.

Leave a comment