వికేంద్రీకరణ: మూడు రాజధానులు వర్సెస్ మూడు ఆర్థిక జోన్లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘వికేంద్రీకరణ’ పేరుతో గత వైఎస్సార్‌సీపీ మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు తీవ్ర రాజకీయ, ఆర్థిక చర్చలకు దారితీశాయి. రెండు విధానాల అంతిమ లక్ష్యం ప్రాంతీయ అభివృద్ధి అయినప్పటికీ, వాటి అమలు, దృష్టికోణంలో భారీ వ్యత్యాసం ఉంది.

గత ప్రభుత్వం ‘మూడు రాజధానుల’ (పాలనా వికేంద్రీకరణ) విధానాన్ని తెరపైకి తీసుకురాగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ‘మూడు ఆర్థిక జోన్ల’ (ఆర్థిక వికేంద్రీకరణ) వ్యూహాన్ని తీసుకొచ్చింది.

గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2020లో ‘AP Decentralisation and Inclusive Development of All Regions Act’ ద్వారా మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా (Executive Capital), అమరావతి శాసన రాజధానిగా (Legislative Capital), మరియు కర్నూలు న్యాయ రాజధానిగా (Judicial Capital) ఉండాలి. దీని వెనుక ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందాలన్నది.

అయితే, ఈ నిర్ణయంపై పాలనా సమన్వయం లోపించే అవకాశం ఉందని, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం వలన ప్రభుత్వ యంత్రాంగంపై అదనపు ఆర్థిక భారం పడుతుందని విమర్శలు వచ్చాయి.

ముఖ్యంగా, అమరావతి రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చినా, రాజధాని మార్పుతో తీవ్రంగా నష్టపోయామని పెద్ద ఎత్తున నిరసనలు, న్యాయ పోరాటాలు చేశారు. నవంబర్ 2021లో, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకుంది, కానీ ‘మెరుగైన, సమగ్రమైన బిల్లు’ తెస్తామని ప్రకటించింది.

తాజాగా అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తూనే, అభివృద్ధిని వికేంద్రీకరించడానికి ‘మూడు ప్రాంతీయ అభివృద్ధి జోన్ల’ వ్యూహాన్ని ప్రకటించింది.

ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్య కోస్తా ప్రాంతాలకు ఈ జోన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ మూడు ఆర్థిక జోన్లకు విశాఖపట్నం, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ఉంటాయని తెలుస్తోంది.

ఈ విధానం ఆర్థిక వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే, పాలనా వ్యవస్థను విడదీయకుండా, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రాంతాల వారీగా ప్రోత్సహించడం. తద్వారా అన్ని ప్రాంతాలలో ఉపాధి, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

దీనివల్ల పాలనా సమన్వయం దెబ్బతినకుండా, అమరావతి నిర్మాణానికి అడ్డంకులు తొలగి, రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇటీవల, అమరావతి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, రాజధాని అభివృద్ధి ‘ఆపశక్యం’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు, అలాగే రెండో దశ భూ సమీకరణ (LPS 2.0) కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ రెండు విధానాలపై ప్రధానంగా మూడు అంశాల చుట్టూ విమర్శలు కొనసాగుతున్నాయి.

1.పాలనా సమన్వయం: మూడు రాజధానుల వల్ల ప్రభుత్వ కార్యకలాపాల సమన్వయానికి ఇబ్బంది, అపారమైన ప్రయాణ ఖర్చులు తప్పవని ప్రతిపక్షం (ప్రస్తుత కూటమి) గతంలో విమర్శించింది. అయితే, మూడు ఆర్థిక జోన్ల వల్ల పాలనా యంత్రాంగం ఒకే చోట (అమరావతిలో) ఉండి, అభివృద్ధిని మాత్రమే వికేంద్రీకరించవచ్చని కూటమి చెబుతోంది.

2.ఆర్థిక భారం: కొత్త రాజధాని (అమరావతి) నిర్మాణానికి భారీ వ్యయం అవుతుందని గత ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అమరావతి అభివృద్ధిని కొనసాగిస్తూనే, మూడు జోన్లలో మౌలిక సదుపాయాలకు పెట్టుబడులు పెట్టడం వల్ల మొత్తం ఆర్థిక భారం ఎలా సర్దుబాటు అవుతుందన్నది ప్రశ్నార్థకం.

3.అమరావతి రైతుల అంశం: గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తీవ్రంగా నష్టపోయిన అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తోంది. వారి సమస్యలను పరిష్కరించడానికి, భూ సమీకరణ పథకం (LPS) ద్వారా అప్పగించిన ప్లాట్లకు సంబంధించిన పెండింగ్ సమస్యలు, ‘వాస్తు’ వివాదాలు, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు వంటి డిమాండ్లను పరిష్కరించడానికి చొరవ చూపుతోంది.

కానీ ఈ కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ హయాంలో తీసుకొచ్చిన “మూడు రాజధానులు” తరహాలోనే ” “మూడు ఆర్థిక జోన్లు” తెరపైకి తీసుకురావడం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.! 

Leave a comment