రూ. 200 కోట్ల విదేశీ గంజాయి సీజ్: బెంగళూరు ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ దందా!

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) మరోసారి డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న కస్టమ్స్ అధికారులు తాజాగా ఊహించని స్థాయిలో భారీ గంజాయిని పట్టుకున్నారు. ఇది మామూలు గంజాయి కాదు, కోట్ల విలువైన విదేశీ గంజాయి కావడం గమనార్హం.

విశ్వసనీయ సమాచారం మేరకు ఎయిర్‌పోర్టులో తనిఖీలను కట్టుదిట్టం చేసిన కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) బృందం.. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికులపై దృష్టి పెట్టింది. వారి లగేజీని తనిఖీ చేయగా, ఏకంగా 273 కిలోల విదేశీ గంజాయి బయటపడింది. దీని మార్కెట్ విలువ అక్షరాలా రూ. 200 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కళ్ల ముందు రూ. 200 కోట్ల విలువైన డ్రగ్స్ కనిపించే సరికి అధికారులే ఆశ్చర్యపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

డ్రగ్స్ మాఫియా కొత్త కొత్త పద్ధతులతో కస్టమ్స్ కళ్లుగప్పాలని చూసినా, అది నెరవేరలేదు. ఈ కేసులో పట్టుబడిన నలుగురు విదేశీయులు తమ బ్యాగుల్లోని ‘ఎనర్జీ డ్రింక్’ టిన్లలో గంజాయిని నింపి, ప్యాకింగ్ చేశారు. మామూలుగా చూస్తే, అవి కూల్ డ్రింక్ టిన్లే అనిపిస్తాయి. ఏమాత్రం అనుమానం రాకుండా పక్కా ప్లాన్‌తో వచ్చిన కేటుగాళ్లు, కస్టమ్స్ అధికారుల నిఘా ముందు బోల్తా పడ్డారు. మరికొన్ని సందర్భాల్లో.. స్మగ్లర్లు ట్రాలీ బ్యాగుల్లో ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి, అందులో గంజాయిని దాచి తరలిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు.

నిజానికి, ఈ ఒక్క కేసు మాత్రమే కాదు. నవంబర్ నెలలో బెంగళూరు ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ పట్టుబడటం అనేది ఒక ట్రెండ్‌గా మారింది. ఇదివరకు ఈ నెల మొదటి వారంలోనే రూ. 94 కోట్ల విలువైన 94 కిలోల గంజాయిని కూడా కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది. ఈ వరుస దాడుల ఫలితంగా ఇప్పటివరకు నలుగురు విదేశీయులు సహా మొత్తం 32 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్ బెంగళూరును తమ గేట్‌వేగా వాడుకుంటుందనేందుకు ఇది నిదర్శనం.

విదేశాల నుంచి వస్తున్న ఈ హై-గ్రేడ్ గంజాయిని (హైడ్రోఫోనిక్ గంజాయి) దేశంలోని ప్రధాన నగరాల్లోని యువతనే టార్గెట్‌గా చేసి అమ్ముతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బడాబాబుల పిల్లలే వీరి ప్రధాన లక్ష్యం. డ్రగ్స్‌కు బానిసలైన యువత జీవితాలు నాశనమవుతున్నా, డ్రగ్స్ మాఫియా అక్రమ రవాణాను మాత్రం ఆపడం లేదు.

ఇంత పెద్ద ఎత్తున గంజాయి ఎందుకు దిగుమతి అవుతోంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్ ఏంటి? భారత్‌లో ఈ డ్రగ్స్‌ను ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే కోణాల్లో కస్టమ్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ భారీ పట్టుబడులు.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అధికారుల పట్టుదలను మరోసారి చాటి చెప్పాయి.

యువత భవిష్యత్తును కాపాడాలంటే, ఇలాంటి మాదకద్రవ్యాల ముఠాలపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. స్మగ్లర్లు ఎన్ని కొత్త పద్ధతులు వాడినా, కస్టమ్స్ నిఘా నుంచి తప్పించుకోలేరని ఈ ఘటన స్పష్టం చేసింది.

Leave a comment