ఆంధ్రప్రదేశ్‌లో కులాల కంపు.. రాజకీయాల నుంచి సినిమా వరకు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనగానే ముందుగా వినిపించే పదం ‘కులం’. ఇది కేవలం సామాజిక అంశం కాదు, రాష్ట్ర రాజకీయాలను, సినిమా రంగాన్ని శాసించే శక్తిగా మారిపోయింది.

దశాబ్దాలుగా ఉన్న ఈ కుల సమస్య, గత కొన్నేళ్లుగా పతాక స్థాయికి చేరింది. రాజకీయ పార్టీలు కులాలను తమ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఓటు బ్యాంక్‌గా మార్చుకోవడం బహిరంగ రహస్యం.

జనాలని కులాల వారీగా విడదీయడం ద్వారా ప్రాంతీయ, అభివృద్ధి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లి, భావోద్వేగాల ఆధారంగా ఓటు వేయించుకోవడంలో పార్టీలు సక్సెస్ అవుతున్నాయి. ఒకప్పుడు సెంటిమెంట్ పనిచేసేది, ఇప్పుడు కుల సెంటిమెంట్‌ను పార్టీలు తమ లాభం కోసం పెంచి పోషిస్తున్నాయి. ఈ విభజన రాజకీయం వల్ల వ్యక్తిగత సంబంధాలు, సామాజిక సామరస్యం దెబ్బతింటున్నాయి.

పార్టీల వెనుక కులాల సమీకరణ!

తెలుగుదేశం పార్టీ (TDP): వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీకి కమ్మ సామాజిక వర్గం ప్రధాన అండగా ఉంది. వ్యవసాయం, వ్యాపారం, మీడియా, సినీ రంగంలో వీరికున్న పట్టు పార్టీకి బలంగా మారింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP): వై.ఎస్. రాజశేఖర రెడ్డి, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రెడ్డి సామాజిక వర్గం YSRCPకి వెన్నెముకగా నిలుస్తోంది. రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వీరి ఆర్థిక, రాజకీయ ప్రాబల్యం YSRCPకి బలమైన ఓటు బ్యాంకును అందించింది.

జనసేన పార్టీ (JSP): సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు కాపు సామాజిక వర్గం ముఖ్యమైన శక్తిగా మారింది. కాపుల సంఖ్యాబలం, పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ కలగలిసి జనసేన ఓటును ప్రభావితం చేస్తున్నాయి.

సినిమా రంగం.. రాజకీయాలకు లాంచింగ్ ప్యాడ్!

ఆంధ్ర, తెలంగాణలో సినిమా, రాజకీయాల బంధం కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి సినీ దిగ్గజాలు రాజకీయాల్లోకి రావడానికి కులం, ఫ్యాన్ బేస్ బలంగా ఉపయోగపడ్డాయి.

టాలీవుడ్‌లో నిర్మాతలు, దర్శకులు, నటులలో కమ్మ, కాపు, రెడ్డి వర్గాల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తుంది. తమ కుల హీరోల సినిమాలను, వారి రాజకీయ అరంగేట్రాన్ని ఫ్యాన్స్ ఒక కుల ఐడెంటిటీగా చూస్తున్నారు. ఇది సినిమా పండుగలా కాకుండా, కుల పండుగలా కనిపిస్తుందని విమర్శకులు అంటున్నారు. నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య నడిచే ‘ఫ్యాన్ వార్స్’ కూడా కొన్నిసార్లు కులాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేస్తోంది.

కూటమి విజయం వెనుక కుల సమీకరణ..!

తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధించడంలో కులాల సమీకరణ వ్యూహం పక్కాగా పనిచేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఒక పార్టీకి అండగా ఉండే బలమైన కులం, మరో పార్టీకి బలంగా ఉన్న కులంతో జత కట్టడం వల్ల, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటును ఏకం చేయగలిగారు. ఇది కేవలం ప్రజా వ్యతిరేకత మాత్రమే కాదు, కుటుంబాలు, ప్రాంతాలు, కులాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో కూటమి సక్సెస్ అయింది. కులం అనే పాయింట్‌ను వాడుకోవడంలో ఏ పార్టీ వెనుకబడలేదు.

‘అమరావతి – కమ్మరావతి’ వివాదం..!

రాజధాని అమరావతి అంశం కూడా కుల కోణంలోనే రాజకీయంగా వాడివేడిగా మారింది. అమరావతి ప్రాంతంలో భూములు ఉన్న కారణంగా, దీనిని YSRCP నాయకులు వ్యతిరేకిస్తూ “కమ్మరావతి” అని పదేపదే ప్రచారం చేశారు. ఇది రాజధాని అంశాన్ని ప్రాంతీయ అభివృద్ధి సమస్యగా కాకుండా, కులాల మధ్య ఆధిపత్య పోరుగా మార్చింది. దీని ద్వారా వైఎస్సార్సీపీ ఇతర బలహీన వర్గాల ఓటును తమవైపు తిప్పుకోవాలని చూసింది.గెలుపు ఓటములను ఎలా ఉన్నా అమరావతి చుట్టూ అంటుకున్న ఈ కుల మరక ఇప్పట్లో పోయేట్టు కనిపించడం లేదు.

అయితే, పార్టీలన్నీ పైకి ‘సామాజిక న్యాయం’ అంటున్నా, అభ్యర్థుల ఎంపిక నుంచి కీలక పదవుల వరకు కుల ప్రాతిపదికనే నిర్ణయాలు జరుగుతుండడం ఈ కంపుకు ముగింపు లేదని స్పష్టం చేస్తోంది. ఏదేమైనా, కుల సమీకరణ వ్యూహాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేటికీ చెక్కుచెదరని వాస్తవం.

సినిమాకు కులం గోడ.!

కులం గోడ కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు, టాలీవుడ్‌ను కూడా చుట్టుముట్టింది. హీరోల మధ్య ఉన్న పోటీ ఇప్పుడు కులానికి-కులానికి మధ్య పోటీగా మారిపోయింది. ఒక వర్గానికి చెందిన ప్రేక్షకులు ఇతర హీరోల సినిమాలను చూడటానికి ఇష్టపడకపోవడం, ఒక సినిమా హిట్టయినా కులం రంగు పులమడం, ఫ్లాప్ అయితే మరో కులం పండగ చేసుకోవడం.. ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న సామాజిక రుగ్మతను స్పష్టంగా చూపిస్తున్నాయి. దీనివల్ల సినిమాకు రావాల్సిన నిజమైన కలెక్షన్లు తగ్గిపోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఆ తేడా ప్రస్పుటంగా కనిపిస్తోంది.నిన్న గాక మొన్న వచ్చిన OG లాంటి సినిమాలను గమనిస్తే ఈ విషయం పూర్తిగా అర్థం అవుతుంది.ఎందుకంటే అన్నీ చోట్ల బ్రేక్ ఈవెన్ అయిన ఆ సినిమా ఆంధ్రాలో మాత్రం దాదాపు 10 కోట్ల నష్టాన్ని మిగిల్చింది..

ఈ కుల రాజకీయాల వల్ల రాష్ట్రానికి అభివృద్ధి పరంగా, సినిమా పరిశ్రమ పరంగా, సామాజిక సామరస్యం పరంగా, తీవ్ర నష్టం జరుగుతోంది. అభివృద్ధి, పాలన అంశాలు పక్కకు పోయి, ఎవరు ఎవరి కులం అనేది ప్రధాన చర్చనీయాంశమవుతోంది. ఈ కుల చిచ్చు నుంచి రాష్ట్రం ఎప్పుడు బయటపడుతుందో ఆ “కుల దేవుళ్ల” కే తెలియాలి. ప్రజలు కులాన్ని పక్కన పెట్టి, పాలన, అభివృద్ధి ఆధారంగా ఓటు వేయడం నేర్చుకుంటేనే ఈ కంపు నుంచి రాష్ట్రం బయటపడుతుంది.

—MB

Leave a comment