కోలీవుడ్ నటుడు ధనుష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన 55వ సినిమా (D55)పై ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో పెద్ద చర్చే నడుస్తోంది. దీనికి కారణం.. ఈ ప్రాజెక్ట్‌లో మలయాళ మెగాస్టార్ మమ్మూటీ, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి వంటి స్టార్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండడమే!
‘D55’ సినిమాకు ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం భారీ స్థాయిలో, విస్తృతమైన తారాగణంతో రూపొందనున్న ఒక గ్రాండ్ ఆక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాదు, ఈ సినిమా ‘అమరన్’ మాదిరిగానే సామాజిక నేపథ్యం ఉన్న, గుర్తింపులేని హీరోల కథాంశంతో ఉంటుందని దర్శకుడు స్వయంగా హింట్ ఇచ్చారు. అంటే, కథలో ఎమోషన్, ఎంగేజ్‌మెంట్ గట్టిగా ఉండబోతోందని అర్థమవుతోంది.
మలయాళ మెగాస్టార్ మమ్మూటీ ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనతో చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ మమ్మూటీ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే, ధనుష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. మమ్మూటీ వంటి స్టార్ నటుడు పవర్-ప్యాక్డ్ రోల్‌లో కనిపిస్తే.. సినిమా స్థాయి అమాంతం పెరిగిపోతుంది. ధనుష్-మమ్మూటీ మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్‌కి కనులపండగే అవుతాయి. (అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది).
సినిమాకు సంబంధించిన మరో ముఖ్యమైన అప్‌డేట్ ఏంటంటే… సాయి పల్లవి హీరోయిన్‌గా నటించే అవకాశం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ పాత్ర కోసం పూజా హెగ్డే, మీనాక్షి చౌదరి వంటి పేర్లు వినిపించినా, ఇప్పుడు సాయి పల్లవి ఫేవరెట్‌గా మారింది.
ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన మారి 2 చిత్రంలోని “రౌడీ బేబీ” సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీ, డ్యాన్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ ఈ హిట్ పెయిర్ తెరపైకి వస్తుందంటే.. ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేవు. అంతేకాదు, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, సాయి పల్లవి కాంబో కూడా ‘అమరన్’తో సక్సెస్ సాధించింది. ‘D55’లో సాయి పల్లవి పాత్ర చాలా బలమైన, భావోద్వేగభరితమైనదిగా ఉంటుందని అంటున్నారు. అంటే, ఆమె కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కథలో కీలక పాత్ర పోషించబోతున్నారన్నమాట.
నిజానికి, ‘D55’ చిత్రాన్ని మొదట గోపురం ఫిల్మ్స్ పతాకంపై అన్‌బుచెళియన్, సుస్మిత అన్‌బుచెళియన్ నిర్మించనున్నట్లు 2024 నవంబర్‌లో ప్రకటించారు. అయితే, బడ్జెట్ పెరగడం, క్రియేటివ్ విభేదాల కారణంగా ఈ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినట్లు తాజా సమాచారం. దీంతో ధనుష్ తన సొంత బ్యానర్ వండర్‌బార్ స్టూడియోస్ కింద ఈ సినిమా బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా, టీమ్ విజన్‌కు అనుగుణంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా యువ సంచలనం సాయి అభ్యంకర్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఏడాది (2026) ప్రారంభంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ భారీ తారాగణం, పవర్-ప్యాక్డ్ కథతో ‘D55’ తమిళ్‌లోనే కాక, పాన్-ఇండియా స్థాయిలో కూడా భారీ అంచనాలను పెంచుతోంది.

